టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఉదయం క్రితం విడుదలయ్యారు. పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ కోర్టు బండి సంజయ్ కు గురువారం అర్థరాత్రి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉదయం ఫస్ట్ అవర్‌లో ప్రక్రియను పూర్తి చేసిన బీజేపీ లీగల్ సెల్ బండి సంజయ్‌న బయటకు తీసుకొచ్చింది.
తెలంగాణ పదోతరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కుట్ర పన్నారన్న కారణంతో బండి సంజయ్‌ను రెండు రోజుల క్రితం కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే.. బుధవారం నాడు 14 రోజుల రిమాండ్ విధించారు. తనకు వరంగల్ జైల్లో ప్రమాదం ఉందని కరీంనగర్ తరలించాలని సంజయ్ విజ్ఞప్తితో అక్కడకు తరలించారు.
బీజేపీ లీగల్ సెల్ టీమ్ సంజయ్ తరఫున హన్మకొండలో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం నుంచి 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఇద్దరు వ్యక్తుల హామీ, రూ.20 వేల పూచీకత్తుతో హన్మకొండ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం అన్ని ఫార్మాలిటిస్ పూర్తి చేసిన లీగల్ సెల్ బండి సంజయ్‌ను కరీంనగర్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఏ - 1 గా బండి సంజయ్
టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, చాలామందికి పంపారని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.
బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు సీపీ. బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు.