అధికారం అడ్డం పెట్టుకొని తెలంగాణలో బీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ లీడర్లను, కార్యకర్తలను వేధిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆరోపించారు. గతంలో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తన గెలుపును అడ్డుకోలేకపోయారని ఒకానొక సమయంలో అధికార పార్టీ బలగం మొత్తం దించినా ఫలితం లేకుండా పోయిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ ఆగడాలు ఎక్కువయ్యాయని గతంలోని పలుమార్లు ఈటెల ఆరోపించారు.
హుజురాబాద్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని అధికారపక్ష నేతలు చెడగొడుతున్నారు అనీ ఆరోపించారు ఈటల. ప్రజల మీద దాడులు చేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారనీ విమర్శించారు. నిన్న తమ మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ బీజేపీ నేతలు, కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని వెళ్లి విపరీతంగా కొడుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు అని అధికారపక్షం ఆగడాలు శృతిమించాయన్నారు ఈటల. పోలీసులు అధికారపక్షం తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవలసిన అవసరం ఏంది ? కొట్టడం ఏంటి? చట్టం పనిచేస్తుందా అంటూ డీజీపీని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి చెందిన మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్,తుమ్మ శోభన్‌ను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు ఈటల.
ఈ మధ్య మళ్లీ పెరిగిన రాజకీయ వేడి...
హుజురాబాద్ కేంద్రంగా ఈ మధ్య రాజకీయంగా ఎన్నికల సమయంలో ఉండే వాతావరణం కనిపిస్తోంది. ఐటీ పురపాలక శాఖ మంత్రి ఈ నియోజకవర్గంలో పర్యటన జరిపిన తరువాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఈటల రాజేందర్‌ని మాత్రం ఆహ్వానించలేదు. మరోవైపు ఈటలన్ని టార్గెట్ చేస్తూ తన ప్రసంగాల్లో గట్టిగానే ప్రశ్నించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ నియోజకవర్గంలో గెలుపు సొంతం చేసుకోవాలని ఇప్పటి నుంచి దూకుడు పెంచారు స్థానిక నాయకులు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.