Jagtial Crime News: సినిమాల్లో చూపించినట్టు రియల్ లైఫ్‌లో చేద్దామని భావిస్తున్న కొందరు పోలీసు అధికారులు బోల్తా పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పోలీసులోని కొందరు అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏదో అధికారిపై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ మహిళపై ఓ ఏఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ కొట్టిన వీడియో వైరల్ అయింది. ఇది జనాలు మర్చిపోక ముందే మరొక ఘటన వెలుగుచూసింది. జగిత్యాల జిల్లాలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిపై ఎస్‌ఐ చేయి చేసుకున్నారని ఆత్మహత్య చేసుకున్నాడు.
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొల్లారపు శివప్రసాద్ పెట్రోల్ పోసుకొని అత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది స్థానికంగా పెను సంచలనంగా మారుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన అతనికి భార్య కవితతో గొడవలు ఉన్నాయి. దీనిపై కోరుట్ల పోలీసు స్టేషన్‌లో కేసు నడుస్తోంది. కోరుట్ల ఎస్సై శ్వేత ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ కౌన్సిలింగ్‌లో బొల్లారపు శివప్రసాద్‌పై చేయిచేసుకున్నట్టు సమాచారం. దీన్ని తట్టుకోలేకపోయిన శివప్రసాద్ ఇంటికి వెళ్లి అత్మహత్యయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శివప్రసాద్ పెట్రోల్ పోసుకొని అత్మహత్యయత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్న ఆయన్ని ముందు వరంగల్, ఆ తర్వాత హైదరాబాదు గాంధీ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం శివ ప్రసాద్ మృతి చెందాడు. ఈ మృతికి ఎస్సై శ్వేత కారణమన శివప్రసాద్ సోదరి చెబుతోంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా ఎస్‌ఐ శ్వేతా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
Also Read: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!