Karimnagar News: కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి కలకలం రేగింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ రేపింది. చొప్పదండి మండలంలో భూపాలపట్నం గ్రామంలో నివాసం ఉండే బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాంబయ్య ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. అందులో చెప్పిన కారణాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆ కేసు ఓ సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.
ఓ భూమి విషయంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సి.ఐ గోపీ బెదిరించాడని అంటూ లేఖ రాసిన సాంబయ్య... తన చావు ఆయనే కారణమంటూ పేర్కొన్నాడు. నా చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సి.ఐ గోపీ కారణం అంటూ నోట్ రాసి తనువు చాలించడం కరీంనగర్ జిల్లాలోనే తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
చొప్పదండి మండలం భూపాలపట్నంలో ఇరవై గుంటలు భూమిని ఇంటలిజెన్స్ సిఐ గోపీ కొనుగోలు చేశారు. ఆ భూమిని చొప్పదండికి చెందిన సాంబయ్య మధ్యవర్తిగా సేల్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమైంది.
ఇరవై గుంటల భూమిని యాభై లక్షలకి కొన్న సీఐ భారీ లాభాలు ఆశించారు. అదే టైంలో ఆ ల్యాండ్‌ను అమ్మకానికి ఉందని సాంబయ్య సమాచారం ఇచ్చాడు. పది లక్షల లాభం వస్తుందని సూచాయిగా చెప్పాడు. కాలక్రమేనా రియల్ ఎస్టేట్ భూం పడిపోయింది.
రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవడంతో ఆ ల్యాండ్‌కు అనుకున్న ధర రాలేదు. ప్లాట్లు కూడా అమ్ముడు పోలేదు. దీంతో సీఐ గోపీకి ఆరు లక్షలు మాత్రమే సాంబయ్య ఇచ్చాడు.
తనకు పది లక్షలు వస్తుందని చెప్పారని మిగతా సొమ్ములు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. అధికారి కావడంతో మరింత కఠినంగా బెదిరించినట్టు కుటుంబ సభ్యులు, ఇతర సాక్ష్యాలు చూస్తుంటే అర్థమవుతుంది.
నాలుగు లక్షలు తీసుకొచ్చి ఇవ్వలేక సీఐ గోపీ వేధింపులు భరించ లేక సూసైడ్ చేసుకున్నాడు సాంబయ్య. గోపీ వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు.