జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలే నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికలు, అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆవ్రయించడంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచి, రికౌంటింగ్ చేయాలని  అధికారులను ఆదేశించింది. కానీ నేడు జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ పాషా కోర్ట్ ఆదేశాల మేరకు జగిత్యాల వీఆర్కే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి వెళ్లగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాళాలు లేకపోవడం వల్ల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయలేకపోయాం అని తెలిపారు. రూమ్ తాళాలు లేకపోవడం వల్ల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తెరవలేకపోయా అని, ఇదే ఆంశాన్ని గౌరవ కోర్టుకు నివేదిస్తాం అన్నారు కలెక్టర్ యాస్మిన్ బాషా. కోర్టు సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతాం అన్నారు. 


అడ్లూరి లక్ష్మణ్ ఫైర్...
ధర్మపురి నియోజకవర్గం 2018 ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన  ఆదేశాలు ఇచ్చినా.. తాళాలు లేవంటూ స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయకపోవడమేంటి..? అని ఆయన ప్రశ్నించారు. ఒక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశామని కలెక్టర్ చెబుతున్న దాంట్లో కోర్ట్ కోరిన డాక్యుమెంట్స్ లేవు అంట. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం.. కోర్టుకు కూడా వెళ్లతాం అన్నారు. ఇది నిర్లక్ష్యమా, ఉద్ధేశ్యపూర్వకంగా జరిగిందా తేటతెల్లం కావాలన్నారు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్. 


గత ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓడిపోవడంతో... ఓట్ల లెక్కింపులు అవకతవకలు జరిగాయని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పలు కీలక డాక్యమెంట్లను సమర్పించాలని చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవాల్సి ఉంది. అందులో ఉన్న కీలక డాక్యుమెంట్లను నిర్ణీత తేదీలోగా న్యాయస్థానానికి అందజేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ తాళాలు కనిపించడం లేదంటూ అధికారులు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయలేదు. 


అసలేం జరిగిందంటే..? 
2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేశారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బరిలో దిగారు. నువ్వానేనా అన్నట్టుగా జరిగిన ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్లు ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు ప్రకటించారు. అయితే, సరిగ్గా లెక్కించకుండా గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్ నేతలు అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో స్థానంలో నిలిచిన లక్ష్మణ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిపై న్యాయస్థానం సైతం ఆశ్రయిస్తామని అప్పట్లోనే ప్రకటించారు. 


సీనియర్ నేతగా పేరు ఉన్న కొప్పుల ఈశ్వర్ ఓటమి భయంతోనే గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని అడ్లూరు లక్ష్మణ్ ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరగడంతో అనేక ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో పోటీ పడ్డారని, అయినప్పటికీ చివరి నిమిషంలో ఓడిపోతారని భయంతో అధికారుల అండ చూసుకుని తప్పుడు మార్గంలో గెలిచారని ఆరోపించారు. ఇంత చేసినప్పటికీ కేవలం 441 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంపై కాంగ్రెస్ కూడా అనుమానం వ్యక్తం చేసింది. అయితే వీవీ ప్యాట్ల ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించక ముందే అధికారులు కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది.