హుజూరాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల సమయానికి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ఆ మూడింటిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఈ ఫలితాలు వెల్లడయ్యే క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలి రెండు రౌండ్లలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఇతర ఇండిపెండ్లకు వచ్చిన ఓట్ల సంఖ్యను చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.


హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండిపెండెంట్, మనుగడలో లేని పార్టీలకు చెందిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా రెండు రకాల గుర్తులు టీఆర్ఎస్, బీజేపీ గుర్తులను పోలి ఉండడం ఆ పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగే క్రమంలో ఆ రెండు గుర్తులకు వస్తున్న ఓట్లు దీనికి మరింత బలం చేకూరుస్తోంది.


ఉప ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


కాంగ్రెస్‌కు ఓట్లకు చేరువగా ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి ఓట్లు
ప్రజా ఏక్తా పార్టీ తరపున పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థికి తొలి రౌండ్‌లో 122 ఓట్లు రాగా.. రెండో రౌండ్‌లో 158 ఓట్లు వచ్చాయి. ఈయన ఎన్నికల గుర్తు రోటీ మేకర్. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థికి సమీప సంఖ్యలో ఈయనకు ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్‌కు రెండు రౌండ్లలో కలిపి 339 ఓట్లు వచ్చాయి. రోటీ మేకర్ గుర్తు దాదాపు కారు గుర్తును పోలినట్లుగా ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇండిపెండెంట్లు అందరికీ సింగిల్ లేదా డబుల్ డిజిట్లలో ఓట్లు రాగా.. సిలివేరు శ్రీకాంత్ అనే వ్యక్తికి రెండు రౌండ్లలో కలిపి 280 ఓట్లు వచ్చాయి. రోటీ మేకర్ గుర్తు కారును పోలి ఉండడం వల్ల కొంత మంది ఓటర్లు రోటీ మేకర్‌నే కారుగా భావించి ఓటు వేసి ఉంటారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.


అంతేకాకుండా కంటే సాయన్న అనే వ్యక్తి గుర్తు కూడా ఓటర్లను తికమక పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సాయన్న అనే వ్యక్తి ఎన్నికల గుర్తు వజ్రం. ఇది కాస్త కమలం గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు తికమక అయినట్లుగా తెలుస్తోంది. ఈయనకు రెండు రౌండ్లలో కలిపి ఏకంగా 190 ఓట్లు వచ్చాయి. వజ్రం గుర్తు కమలం గుర్తును పోలి ఉండడం వల్ల ఓటర్లు తికమక పడి ఉంటారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.


Also Read: Huzurabad, Badvel Bypoll Results Live: మూడో రౌండ్‌లోనూ ఈటల ముందంజ.. మొత్తం 1269 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి