Karimnagar Crime News: నడిరోడ్డుపై కళ్ల ముందు ప్రమాదం జరిగితే మనకెందుకులే అనుకునే రోజులు ఇవి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలంటే ఆలోచించే కాలం ఇది. కానీ ఓ జాలరి అందరిలా ఆలోచించలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి రెండు నిండు ప్రాణాలను కాపాడాడు. ఎక్కడో తనకు అరకిలోమీటర్ దూరంలో జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి అక్కడికి పరుగు తీశాడు. నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని కాపాడి నిజమైన హీరో అని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 


ఫొటోలు తీసుకుంటూ నీటిలో మునక
కరీంనగర్‌ నగరానికి చెందిన బంగారి విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సోమవారం ఆయన తన భార్య, కుమార్తె, కుమారుడు, అత్తతో కలిసి సోమవారం దిగువ మానేరు రిజర్వాయర్ వద్ద విహారానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు అంతా సరదాగా గడుపుతున్న క్రమంలో విజయ్ కుమార్ కుమార్తె ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు విజయ్‌కుమార్‌ నీటిలోకి దూకారు. అయితే ఆయనకు ఈత రాకపోవడంతో మునిగిపోయారు. 


నీటిలో మునిగిపోతున్న తండ్రి, సోదరిని కాపాడేందుకు అక్కడే ఉన్న పదిహేనేళ్ల కుమారుడు సైతం జలాశయంలోకి దూకాడు. అతనికి కూడా ఈత రాకపోవడంతో ముగ్గురు ముగిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కేకలు చేశారు. ఆ సమయంలో చేపలు పట్టడానికి వెళ్తున్న తిమ్మాపూర్‌ మండలం అల్గునూరు చేపల కాలనీకి చెందిన మత్స్యకారుడు కొత్తూరి శంకర్‌ వారి కేకలు విని అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. నీటిలోకి దూకి యువతి, బాలుడి ప్రాణాలు కాపాడారు. పిల్లలను కాపాడే క్రమంలో విజయ్‌కుమార్‌ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అదే బాధగా ఉంది
నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని కాపాడిన శంకర్‌ను అధికారులు, స్థానికులు అభినందించారు. ప్రమాదంపై జాలరి శంకర్ స్పందిస్తూ.. చేపల కోసం వలలు వేయడానికి వెళ్తుండగా తనకు మహిళల అరుపులు వినిపించినట్లు చెప్పారు. వేగంగా వెళ్లి చూడగా అక్కడ తనకు నీటిలో మునిగిపోతున్నఇద్దరి చేతులు కనిపించినట్లు తెలిపారు. ఒకరి తర్వాత ఒకరిని తెప్ప మీద వేసి ఒడ్డుకు చేర్చానని వెల్లడించారు. కుటుంబ పెద్ద అయిన విజయకుమార్‌ను కాపాడలేకపోయానని, ముగ్గురిని కాపాడి ఉంటే తనకు సంతోషంగా ఉండేదని ఆయన అన్నారు. 


చేపలు పట్టేందుకు వెళ్లి..
తాండూరు మండల పరిధిలోని రాంపూర్‌లో ఇదే నెలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాంపూర్‌కు చెందిన డప్పు రాజునాయక్‌(45) కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మే 12వ తేదీ బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు రమేష్ అక్కడికి వెళ్లి చూడగా నీటిలో శవమై కనిపించాడు. వెంటనే వదిన సావిత్రి బాయి, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకుతీశారు. రాజునాయక్‌ భార్య సావిత్రిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వలను బయటకు తీసే క్రమంలో రాజునాయక్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.