ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ సర్వేలో నెలవారి పాయింట్ల సాధనలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అధీనంలోని స్వచ్ఛభారత్ మిషన్‌ను ప్రకటించిన ఓడీఎఫ్ ప్లస్ స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే పాయింట్ల పట్టికలో దేశంలోని మొదటి నాలుగు స్థానాలు తెలంగాణకే దక్కాయి. అందులోనూ మూడు ఉమ్మడి జిల్లాలో ఉండడం విశేషం. 


స్వచ్ఛ ప్రగతిలో రాజన్న సిరిసిల్ల ముందు వరుసలో ఉండగా, జగిత్యాల కాస్త వెనుకబడి ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాణాళిక అమలు, అధికారుల పర్యవేక్షణ, ప్రజాచైతన్యం తోడవడంతో 4 స్టార్ రేటింగ్ లో ముందు నిలిచాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే జాతీయ పురస్కారం రానుంది. పల్లె ప్రగతిలో ఉరికొక సెగ్రిగేషన్ షెడ్డు డంపింగ్ యార్డ్ నిర్మించారు. ప్రతి ఇంటికి ఒక చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ట్రాక్టర్ల ద్వారా తడి చెత్త, పొడి చెత్త సేకరించి సెగ్రిగేషన్ షెడ్లలోని ఘన, ద్రవపదార్థాలను వేరు చేస్తున్నారు. 


ప్లాస్టిక్ ను నిషేధించి వినియోగాన్ని నియంత్రించడంలో పంచాయతీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. స్వచ్ఛతలో పల్లెలు పోటీ పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కొత్తగా ఆలోచించి పుష్ప గుచ్చాలు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత సామూహిక మరుగుదొడ్లు ప్రధాన కూడలిలో ప్రజారోగ్యంపై సందేశాత్మక చిత్రాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. పల్లెలను బహిరంగ మాలవిసర్జన రహితంగా తీర్చిదిద్దడం, గ్రామాల్లో తడి చెత్త పొడి చెత్త సేకరణ,ఘనపదార్థాల నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతలు, మురుగు పారుదల వ్యవస్థ, పరిశుభ్రతపై ప్రతి నెల జిల్లా స్థాయిలో స్వచ్ఛభారత్ అధికారులు పంచాయతీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 


గ్రామస్థాయిలో అధికార బృందాలతో తనిఖీ చేసి ఆన్లైన్ నమోదు చేస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రతినెలా దేశవ్యాప్తంగా జిల్లాలకు రేటింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఫోర్ స్టార్ ప్రగతి సర్వే విడుదల చేశారు. ఏప్రిల్ చివరి నాటికి అన్ని పంచాయతీలు సంపూర్ణంగా ఆన్లైన్ చేయడంతోపాటు అంతర్గత తనిఖీలు పూర్తి చేస్తే ఫైవ్ స్టార్ కేటాయించనున్నారు. 


పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు అంతంత మాత్రం గానే ఉన్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షలు వేచించి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ దారుణంగా మారింది.వర్షం మురుగును నెలలోకి ఇంకించే ఇంకుడు గుంతలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో పెద్దగా ఫలితం కనిపించడం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి సంపూర్ణ స్వచ్ఛత ప్రగతిని ఆన్లైన్ చేయాల్సి ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకుంటే జిల్లాకు జాతీయ పురస్కారం సొంతమవుతుంది. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 పంచాయితీలు ఉండగా, 100 శాతం ఫోర్ స్టార్ రేటింగ్ కనపరిచింది. ఫైవ్ స్టార్ లో 249 పంచాయతీలు ఆన్లైన్లో నమోదు చేయడంతో పోటీలను ఇచ్చేందుకు రెడీ అవుతోంది. కరీంనగర్ 313 పంచాయితీలకు మనందరి 311 ప్రగతి నివేదికలు ఆన్లైన్లో చేర్చారు. 99.36 శాతం తో కొద్ది దూరంలో ఉంది. ఫైవ్ స్టార్ లో 313 పంచాయతీల వివరాలు నమోదు చేశారు. మిగిలిన వాటిని ఆన్లైన్ చేస్తున్నారు.