Telangana Praja Palana Applications: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దరఖాస్తు ఫారంలో బ్యాంకు అకౌంట్ నెంబర్ అడగకపోవడంలో అంతర్యం ఏమిటని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boianapalli Vinod Kumar) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అభయహస్తం, ఇందిరమ్మ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరుగ్యారెంటీల (Congress 6 Guarantees) సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషకార్డుల జిరాక్స్ లు జత చేస్తున్నారు. కానీ అప్లికేషన్ లో బ్యాంక్ వివరాలకు సంబంధించి కాలమ్స్ లేకపోవడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో అనుమానం మొదలైందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజా పాలన (Praja Palana) కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిసిందే.
సంక్షేమ పథకాల డబ్బులు ఎలా చెల్లిస్తారు..
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో వినోద్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలకు ప్రభుత్వం దరఖాస్తు ఫారంలో బ్యాంకు అకౌంట్ గురించి ఎందుకు అడగలేదని ప్రజలలో అనుమానం మొదలైందన్నారు. బ్యాంకు అకౌంట్ కోసం మళ్లీ గ్రామాసభలు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం బ్యాంకు అకౌంట్ లేకుండా లబ్ధిదారులకు ఎలా సంక్షేమ పథకాల డబ్బులు చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ప్రజలు ఆగమవుతున్నారని, మంత్రులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని కోరారు. అకౌంట్ నెంబర్ల కోసం మళ్లీ గ్రామసభలు నిర్వహిస్తారేమో అంటూ సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఏనుగు రవిందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు బైరం పద్మయ్య, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు హైమద్, దూలం సంపత్ గౌడ్, సాయికృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.