కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి LC No.18 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది తమ ఘనతగా చెప్పుకుంటూ, బీఆర్ఎస్ నేతలు సీఎంకు పాలాభిషేకం చేస్తూ సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆర్వోబీ కి కేంద్రం ఆమోదం తెలిపి 7 నెలలైనా ఇంతవరకు ఎందుకు టెండర్ పనులను ఖరారు చేయలేదో సమాధానం చెప్పాలి. గత నెల టెండర్లకు ఆహ్వానించి మళ్ళీ వెనక్కు తీసుకోవడానికి కారణం ఏంటో ప్రజలకు తెలపాలి. 


ఆర్వోబీ నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం ₹126.74 కోట్లను కేంద్రమే చెల్లించేందుకు అంగీకరించిన విషయం నిజం కాదా? అని బీఆర్ఎస్ నేతలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ పనులను ప్రారంభించి తొందరగా పూర్తి చేయాలని అనేకమార్లు తాను తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవం కాదా ? జాప్యాన్ని నిరసిస్తూ బిజెపి నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసింది నిజం కాదా ? అని బండి సంజయ్ అడిగారు. 


‘’గత సంవత్సరం ఆర్వోబీ నిర్మాణానికయ్యే ఖర్చులో 80 శాతం వాటా చెల్లించడానికి తొలుత అంగీకరించి, ఆ తరువాత మాట తప్పింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఆ తర్వాత ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజల అవసరాలను, అవస్థలను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఆర్వోబి నిర్మాణ వ్యయం మొత్తం భరించేందుకు ఒప్పించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని మేమే చేస్తామని కేంద్రానికి చెప్పి, ఇన్ని రోజులు జాప్యం చేస్తూ, కరీంనగర్ ప్రజల అవస్థలకు కారణం అయ్యారు. తిరిగి కేంద్రం వల్లే జాప్యమవుతోందంటూ కేంద్రంపై నిందలేస్తారా ?’’ అంటూ మండిపడ్డారు.





సొమ్ము కేంద్రానిదైతే... సోకు బీఆర్ఎస్ నేతలది !
బీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... ఆర్వోబీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యానికి తామే కారణమంటూ ముక్కు నేలకు రాసి, కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. దీంతోపాటు వెంటనే పనులు ప్రారంభించి, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి కరీంనగర్ ప్రజల ఇబ్బందులను తొలగించాలని బండి సంజయ్ ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.