Atmeeya Sammelanam: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల వద్దకు వెళ్తున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఇటీవల  అగ్నిప్రమాదం జరిగి కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఒకరు చనిపోయారు. సీనియ‌ర్ కార్యకర్త  ధీరావత్ నాను సింగ్ గుండెపోటుతో మృతి చెందారు.


చీకటి మామిడిలో ఏప్రిల్ 21న జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో.. అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు ఆయనను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే దారిలోనే ధీరావత్ నాను సింగ్ ప్రాణాలు కోల్పోయారు. దీరావత్ నాను సింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాంచల తండాకు చెందిన పార్టీ కార్యకర్త. చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పార్టీ కోసమే పని చేస్తున్నట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. చివరికి పార్టీ కోసం సమావేశానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. మృతిచెందిన ధీరావత్ నాను సింగ్ కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.


చీమలపాడు ఆత్మీయసమ్మేళనంలో  అగ్ని ప్రమాదం


పది రోజుల క్రితం ఖమ్మం జిల్లా వైరా నియోజవర్గం కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఈ నిప్పు రవ్వలు స్థానికంగా ఉన్న గుడిసెపై పడటంతో మంటలు చెలరేగాయి. గుడిసెను అంటుకున్న మంటల్ని చల్లార్చేందుకు వెళ్లి పలువురు కార్యకర్తలు లోపలికి వెళ్లారు. అయితే ఆ గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉండటాన్ని గుర్తించకపోవడం, ఆపై భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 


చీమ‌ల‌పాడుఆత్మీయ సమావేశం పరిసరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం జిల్లా పార్టీ నేతలతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు. మృతుడి కుటుంబం, క్ష‌త‌గాత్రుల‌ ఫ్యామిలీలను ఆదుకుంటామన్నారు కేటీఆర్. 


బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి పూరి గుడిసెలో సిలిండర్ పేలడానికి ఎలాంటి సంబంధం లేదని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ఎంపీ నామా పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన నామా నాగేశ్వర రావు.. ఆత్మీయ సమ్మేళనం సభ ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉందని, సమావేశం ప్రారంభమయ్యే సమయంలో ఓ గుడిసెలో సిలిండర్ పేలిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని, కొంత మంది కాళ్లు తెగిపోయాయని ఎంపీ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయిస్తామని నామా స్పష్టం చేశారు.


జగిత్యాలలో గుండెపోటుకు గురైన కార్యకర్త


జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా పార్టీ శ్రేణులు, కవిత  అభభిమానులు భారీగా తరలివచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంతలో పార్టీ లీడర్‌ బండారి నరేందర్ కుప్పకూలిపోయారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన చనిపోయారు. అప్పటి వరకు సందడిగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంతో నిండిపోయింది. రైతు నేత నరేందర్ మృతి తెలియగానే అంతా ఒక్కసారిగా కూలబడిపోయారు. విషయం తెలుసుకున్న కవిత అక్కడకు చేరుకొని నరేందర్ మృతికి సంతాపం తెలిపారు. భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరేందర్ మృతితో జగగిత్యాలలో జరగాల్సిన ఆత్మీయ సమావేశం రద్దైంది. ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.