Karimnagar News : ఆశ మనిషిని ఎంతటి స్థితికైనా తీసుకెళ్తుంది. స్వయంకృషితో కష్టపడితే నలుగురు మెచ్చే మార్గంలో నిలబెడుతుంది. రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా జరుగుతుంది. డబ్బు ఆశ చూపి లక్షల డబ్బుతో ఊడయించాడు ఓ దొంగబాబా. పూజలు చేస్తే డబ్బు రెండింతలవుతుందని హైదరాబాద్ కు చెందిన ఓ దొంగబాబా ముగ్గురు యువకులను నమ్మించాడు. బాబా మాయలో పడిన యువకులు అతడి మాటలు నమ్మి రూ.12 లక్షలు చేతిలో పెట్టారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధార మండలానికి వచ్చిన ఓ యువకుడు ఓ బాబా గురించి చెప్పిన మాటలు నమ్మి ముగ్గురు యువకులు డబ్బులిచ్చారు. పూజలు చేస్తే రాత్రికి రాత్రి నగదు రెట్టింపు అవుతుందని దొంగబాబా చెప్పిన మాయమాటలు నమ్మి రూ.12 లక్షలు ఇచ్చారు. కొత్తపల్లికి చెందిన మధ్యవర్తితో హైదరాబాద్ వచ్చారు యువకులు. ఇంతలో పూజలు చేసి వస్తానని చెప్పిన దొంగబాబా డబ్బులతో పారిపోయాడు. దొంగ బాబా కోసం గాలించి చివరికి ఏం చెయ్యాలో తెలియక ఇంటికి చేరుకున్నారు బాధితులు. గంగధార, నమిలి కొండ, వేములవాడకు చెందిన వ్యాపారులు మోసపోయిన వారిలో ఉన్నారు.
అసలేం జరిగిందంటే?
పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయి, బంగారం రెండింతలు అవుతుందని నమ్మించి దోచుకుంటున్నారు మోసగాళ్లు. ఈ ఘటనలు ఎన్ని జరిగినా ప్రజల్లో మాత్రం అవగాహన రావడంలేదు. బాబాల పేరుతో ఎన్ని మోసాలు జరిగినా జనాలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ లో దొంగబాబా బాగోతం వెలుగుచూసింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ దొంగబాబా బారిష్ పూజ పేరుతో కొంతమంది వ్యక్తులను నమ్మించాడు. బారిష్ పూజ చాలా ప్రత్యేకమైనదని డబ్బు రోజుల వ్యవధిలో రెట్టింపు అవుతుందని నమ్మించాడు. బారిష్ పూజ చేస్తే డబ్బులు రెండింతలు అవుతుందని చెప్పి వ్యాపారులను నమ్మించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు దొంగబాబా మాయలో పడ్డారు. వీరయ్య, మహేందర్, రాజయ్యలు ఇప్పుడు డబ్బు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఈ ముగ్గురు రూ.12లక్షలు దొంగబాబాకు సమర్పించుకున్నారు. రూ.12 లక్షల్ని కోటి రూపాయలు చేస్తానని నమ్మించాడు దొంగబాబా.
రూ.కోటి చేస్తానని నమ్మించి
తమకు కోటి రూపాయలు వచ్చేస్తాయని నమ్మి సంబరపడిపోయిన వీరయ్య, మహేందర్, రాజయ్యలు రూ.12 లక్షలు దొంగబాబాకు సమర్పించారు. డబ్బులు చేతికందేసరికి రాత్రికి రాత్రి పరారయ్యాడు దొంగబాబా. మొత్తం రూ.12 లక్షలు తీసుకుని వారి చేతిలో ఓ నూనె సీసా పెట్టి బాబా పరారయ్యాడు. ఎంతకూ బాబా జాడ లేకపోయేసరికి మోసపోయినట్లు గ్రహించి బాధితులు గంగాధరం మండలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బారిష్ పూజ గురించి పోలీసులకు తెలిపారు. ప్రేమచంద్ అనే వ్యక్తి దొంగబాబాకు తమకు మధ్యవర్తిగా ఉన్నాడని చెబుతున్నారు. దీంతో దొంగబాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.