Minister Prashanth Reddy : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు నరేంద్ర మోదీ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యాపారవేత్త అదానీ నరేంద్ర మోదీకి బినామీ అని ఆరోపించారు. అదానీకి దోచి పెట్టేందుకే దేశ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ అవినీతి అక్రమాలను కేసీఆర్ ఎండగట్టుతున్నందుకే ఈడీతో దాడులు చేస్తున్నారని, ఎమ్మెల్సీ కవితను ఆడబిడ్డ అని చూడకుండా  గంటలకు కొద్ది విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లను ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి అడ్డంగా దొరికిపోయిన మోదీ, విచారణ జరిగితే జైలుకు పోతానని భయంతో తన చెప్పు చేతల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను ఈడీ, సీబీఐ పేరిట దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు. ఈడీ, సీబీఐ దాడులకు బీఆర్ఎస్ నేతలు భయపడరని తేల్చిచెప్పారు. ఓటమి భయంతోనే బీజేపీ ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 


మహారాష్ట్రలో అగ్గిపుట్టింది


తెలంగాణ మీద నరేంద్ర మోదీ కక్ష కట్టి మనకు రావాల్సిన నిధులు, ప్రభుత్వ సంస్థలు రాకుండా అడ్డుకొంటున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ అవినీతి, అక్రమాలను అంతమొందించే వరకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పోరాటం ఆగదని, నరేంద్ర మోదీని దించుడు ఖాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఇచ్చుడు ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్ మాట్లాడేవి అన్ని లఫంగా మాటలేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఇచ్చే రైతు బంధు పథకాలు ఎందుకు ప్రవేశపెట్టరని ప్రశ్నించారు. పంటకు పదివేల రూపాయలు ఎందుకు ఇవ్వరని? రైతులకు ప్రమాద బీమా ఎందుకు వర్తింప చేయరని?మహారాష్ట్ర రైతులు అడుగుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి బీజేపీ నాయకులకు నిలదీస్తున్నారని అన్నారు. అక్కడి శెట్కరి రైతు సంఘం నాయకులు కేసీఆర్ ను కీర్తిస్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో నేడు అగ్గి పుట్టింది కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా గ్రామాలకు గ్రామాలు తరలివస్తున్నాయన్నారు.


రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్...


రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, బుడ్డర్ ఖాన్, ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన దొంగ అని మంత్రి వేముల విమర్శించారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న రేవంత్... రాహుల్ గాంధీ ఎంపీ పదవి ఊడగొడితే ఏం మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. సున్నాలు వేసుకుని బతికే రేవంత్ రెడ్డికి బంజారాహిల్స్ లో బంగ్లా, వేల కోట్ల ఆస్తులు, కాన్వాయ్ వాహనాలు ఎక్కడివి అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.