Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసింది.  కామారెడ్డి జిల్లా  మేనూరు వద్ద నిర్వహించిన ముగింపు సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగుతోందన్నారు.  10 రోజులుగా తెలంగాణలో జరిగిన యాత్ర  మహారాష్ట్రలో ప్రవేశిస్తుందన్నారు.  తెలంగాణలో కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకున్నానన్నారు.  తెలంగాణను వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉందన్నారు.  కాంగ్రెస్ కార్యకర్తలు కష్టం మీడియాలో కనిపించవు.. టీవీలో రావు అన్నారు. పార్టీ కార్యకర్తల పనితీరును తానే స్వయంగా చూశానని రాహుల్ గాంధీ అన్నారు.   


తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ 


 కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ప్రజలతో కలిసి ప్రయాణం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలు కలలను టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఆదివాసీలు, గిరిజనుల కోసం యూపీఏ ప్రభుత్వం ఎంతో చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని లాగేసుకున్నాయని ఆరోపించారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వస్తేనే ఎవరి భూములు వారికి దక్కుతాయని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నానని తనతో చెప్పలేదన్నారు.  దేశంలో హింస, ద్వేషం ఎక్కువైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తాను భారత్‌ జోడో యాత్రను ప్రారంభించానని తెలిపారు.  లక్షల మంది ప్రజలు యాత్రను కొనసాగించేందుకు కావాల్సిన శక్తి ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.  తెలంగాణలో తన పాదయాత్రను ఎప్పటికీ మర్చిపోనన్నారు. 






అధికారంలోకి రాగానే రుణమాఫీ 


" 72,000 కోట్ల రైతు రుణమాఫీని అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసింది. అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తాం.  అన్ని పంటలకు MSP రేట్లు ఇస్తాం  రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం.  కేసీఆర్ కమీషన్లు వచ్చేలా సాగునీటి ప్రాజెక్టులను మారుస్తూ రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. టీఆర్‌ఎస్ కేవలం 5 శాతం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో ఎవరికీ ఉపాధి లేదు. నేను లోక్‌సభలో చూశాను, రైతుల బిల్లుతో సహా మోదీ ప్రభుత్వం  అన్ని బిల్లులకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పుడు టీఆర్‌ఎస్ మోదీకి మద్దతు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. వారి స్నేహితులు కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడం కేసీఆర్ విధానం. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేటీకరించారు. ఇదే మోదీ కేసీఆర్  వైఖరి. GST  నోట్ల రద్దుతో మోదీ ప్రభుత్వం చిన్న పరిశ్రమలను నాశనం చేసింది తద్వారా ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. వారు ఉద్దేశపూర్వకంగా తమ విధానాలతో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. "- రాహుల్ గాంధీ