Kalvakuntla Kavitha : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్లలో కేవలం ఏడుగురికి మాత్రమే మహిళలకు కేటాయించారు. గతం కన్నా ఎక్కువే అయినప్పటికీ ఇటీవల కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలకు ముఫ్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. ఉద్యమం చేస్తానని ప్రకటించారు. మహిళా బిల్లును ఆమోదించేలా ఒత్తిడి చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే సొంత పార్టీలోనే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ విషయంపై కవిత మాట్లాడాలన్న డిమాండ్లు వినిపించాయి. తాజాగా ఆరు శాతం మాత్రమే టిక్కెట్లు ప్రకటించడంతో కవిత ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నయి. దీంతో కవిత కూడా ఎదురుదాడికి దిగారు.
కాంగ్రెస్ విమర్శలపై కవిత ఘాటు రియాక్షన్
మహిళాబిల్లు కోసం ఉద్యమం చేసిన కవిత తమ పార్టీలో కనీస టిక్కెట్లు ప్రకటించకపోవడంపై ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించామని చెబుతున్నారని.. ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు మాత్రమే కేటాయించారన్నారు. అందులో ముగ్గురు గెలిస్తే ఒకరికే మంత్రి పదవి ఇచ్చారన్నారు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్ ను కూడా వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు.
కిషన్ రెడ్డిపైనా విరుచుకుపడిన కవిత
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని గతంలో కవిత జంతర్ మంతర్‌లో డ్రామా సృష్టించారంటూ .. కిషన్ రెడ్డి చేసిన విమర్శలపైనా కవిత స్పందించారు. మహిళల హక్కుల పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన ఆశ్చర్యకరంగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రెండుసార్లు హామీలు ఇచ్చిన బీజేపీ మహిళలను మోసం చేసిందని అన్నారు. పార్లమెంటులో భారీ మెజార్టీ ఉన్నప్పటికీ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కవితకు సోషల్ మీడియాలో వరుస ప్రశ్నలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యప్తునకు పిలిచినప్పుడే.. కవిత మహిళా రిజర్వేషన్ ఉద్యమం చేశారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. ఉద్యమ ప్రణాళిక ప్రకటించి కూడా ఆగిపోయారు. ఈడీ కూడా సైలెంట్ కావడంతో.. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక వేళ .. కవిత ఈ మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ లో ధర్నా చేయకుండా ఉంటే..ఇప్పుడు ఇన్ని విమర్శలు వచ్చి ఉండేవి కావని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.