ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె తన కారులో తండ్రి కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో దాదాపు 10 ఫోన్లను మీడియాకు చూపించారు. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా తన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ఫోన్లకు స్టిక్కర్లు కూడా అతికించి ఉన్నాయి. ఇంటి నుంచి బయలుదేరే ముందే కాకుండా, ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక, లోనికి వెళ్లే ముందు కూడా ఆ ఫోన్లు ఉన్న కవర్లను మరోసారి కవిత పైకి ఎత్తి చూపించారు.