Kadiyam Srihari on KCR Jatipita Issue: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేసీఆర్‌ను  జాతిపిత  అని పిలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ తెలంగాణకు ఎలా జాతిపిత అవుతారని ప్రశ్నించిన కడియం, అలా చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, అది మహాత్మా గాంధీ మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Continues below advertisement

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీశారని కడియం శ్రీహరి ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, దాని వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం రకరకాల స్కాములలో ఇరుక్కుపోయిందని, అవకతవకలు చేసి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని మండిపడ్డారు. 2014 కంటే ముందు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజల సమస్యలపై స్పందించని వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని కడియం నిలదీశారు. అధికారం పోయినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదని, మాట తీరు మారలేదని ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వచ్చి వారి కష్టాలను పట్టించుకోకుండా, ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకుడు ప్రజా నాయకుడు కాలేడని విమర్శించారు.

ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని రాజకీయం చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. తెలంగాణ అంటే మీ అయ్యా సొత్తా? అని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడితే అది తెలంగాణను అవమానించినట్టు ఎలా అవుతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయం కోసం సెంటిమెంట్‌ను రగిల్చే రోజులు పోయాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Continues below advertisement

కడియంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం 

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన విమర్శలపై బీఆర్ఎస్  నేతలు మండిపడ్డారు.   తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్ర అద్వితీయమని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకే ఆయనను గౌరవపూర్వకంగా ప్రజలు అక్కున చేర్చుకున్నారని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి తన రాజకీయ అస్తిత్వం కోసం కాంగ్రెస్ పంచన చేరి, కేసీఆర్‌ను విమర్శించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని  పలువురు నేతలు విమర్శించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనని, సాంకేతిక లోపాలను సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టునే తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ అనేది ప్రజల గుండెల్లో ఉందని, దాన్ని ఎవరూ తుడిచివేయలేరని వారు స్పష్టం చేశారు.