Jupally Krishna Rao : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరబోతున్నారు ?. భారత రాష్ట్ర సమితి నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. ఆయన పెద్దగా ఫీల్ కాలేదు. నిజానికి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నాలుగేళ్లవుతోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో తనపై గెల్చిన బీరం హర్షవర్థన్ రెడ్డిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పటి నుండి జూపల్లిని పక్కన పెట్టారు. స్థానిక ఎన్నికల సమయంలో తన సొంత వర్గాన్ని నిలబెట్టుకుని పోటీగా అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు జూపల్లి. ఇలా చేసినందున హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో ఆయనకు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వెళ్లాయి.
తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ నుంచి జూపల్లి సస్పెండ్
పార్టీ మారుతారని ప్రచారం జరిగింది కానీ ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొల్లాపూర్ వెళ్లిన కేటీఆర్.. జూపల్లి ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరిపారు. అంతా సర్దుకుంటుందనుకునే దశలో బీరం హర్షవర్ధన్ రెడ్డికే వచ్చే సారి కొల్లాపూర్ టిక్కెట్ ఖరారు చేసేశారు. అధికారికంగా ప్రకటించకపోయినా విషయం పై క్లారిటీ రావడంతో జూపల్లి కృష్ణారావు ప్రత్యామ్నాయం చూసుకోవాలని డిసైడయ్యారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వెళ్లి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా ఆయన నిర్ణయించుకోలేదు.
తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న బీజేపీ , కాంగ్రెస్
కానీ రెండు పార్టీల నుంచి ఆయనకు ఆఫర్లు ఉన్నాయి. బీజేపీ లోకి రావాలని చాలా కాలంగా ఆయనకు పిలుపులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయనకు ప్రత్యర్థి అయిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె ఉంటే మళ్లీ తాను బీజేపీలోకి ఎలా వెళ్తారని వెనుకడుగు వేస్తారని భావించారేమో కానీ.. డీకే అరుణతోనే స్వయంగా జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేయించి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. తర్వాత బీజేపీ పెద్దలూ టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.
జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
రాజకయంగా రేవంత్ రెడ్డితో జూపల్లి విబేధించారు కానీ.. అంత తీవ్రంగా కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఆయన మాతృపార్టీ కాంగ్రెస్ పార్టీనే. అందుకే ఇప్పుడు రెండు పార్టీల మధ్య జూపల్లి కృష్ణారావు రాజకీయ భవితవ్యం ఊగిసలాడుతోంది. ఏ పార్టీలో చేరినా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థి ఆయనే అవుతారు. అది ఏ పార్టీ అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.