Andhra News  Journalist suicide  :  చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక.. బిడ్డ హాస్టల్ ఫీజు చెల్లించలేక ఓ జర్నలిస్టు  ( Journalist   ) తండ్రి ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జిగింది. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ( challapalli )  కల్లేపల్లి చంద్ర అనే జర్నలిస్టు సిటీకేబుల్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన తన కుమారుడ్ని  హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నారు. హాస్టల్ ఫీజు కట్టాల్సి ఉండటంతో కొద్ది రోజులుగా.. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారేమోని తిరుగుతున్నారు. నీతి, నిజాయితగా ఉండే  చంద్ర రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల వద్ద ఎప్పుడూ చేయిచాచలేదు. ఇప్పుడు కూడా ఆయన తెలిసిన వారిని సాయం చేయమని అడిగారు కానీ..  పెద్దగా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.              
 
జర్నలిస్టుగా అందరితోనూ కలుపుగోలుగా ఉండే కల్లేపల్లి చంద్ర తన కుమారుడి హాస్టల్ ఫీజ్ కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ రాసి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం సంచలనం సృష్టించింది. చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకోలేక ఇలా బలవన్మరణం చెందడంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.                              


జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం తరుపున కొంత మేర  సాయం అందుతూ ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. సంక్షేమపథకాలను కూడా అమలు చేయడం లేదు. ప్రభుత్వం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పిల్లలు చదువులు కోసం రాయితీ ఇవ్వాలని అడుగుతున్న పట్టించుకునే నాధుడు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి కొద్దిగా మద్దతు ఉన్నా కల్లేపల్లి చంద్ర తన బిడ్డను చదివించుకునేవాడని.. ఇప్పుడు హాస్టల్ ఫీజు కట్టలేక చనిపోయాడని తోటిజర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                                    


ఈ అంశంపై జనసేన నేతలు స్పందించారు. పాత్రికేయుడు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి... కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి   లంకిశెట్టి బాలాజీ... అనునిత్యం కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పాత్రికేయుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వ విధివిధానాలకు చల్లపల్లిలో జరిగిన కల్లేపల్లి చంద్ర ఆత్మహత్య నిలువెత్తు నిదర్శనం అని కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ అన్నారు.        


ప్రభుత్వ విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెబుతూ ఇప్పుడు మార్కెట్ ధరలో 40% విలేకరులే భరించాలని, యాజమాన్యం నుంచి ఐదు సంవత్సరాలు తక్కువ కాకుండా అక్రిడ్షన్ కార్డులు కావాలని, సాధ్యం కానీ నిబంధనలు పెట్టి విలేకరుల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని బాలాజీ అన్నారు. చంద్ర కుటుంబానికి ప్రభుత్వ పరంగా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున బాలాజీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.