అధ్యాపకులు లేని కాలేజీలకు జవహర్‌లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) షాక్ ఇచ్చింది. జేఎన్‌టీయూ పరిధిలోని 148 కాలేజీల్లో భారీ సంఖ్యలో సీట్లకు కోత విధించింది. అధ్యాపకులు లేని కాలేజీలలో ఇంజనీరింగ్ బ్రాంచీల వారీగా సీట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాలేజీలకు అఫిలియేషన్ జారీ చేసింది. కోవిడ్ కారణంగా పలు కాలేజీలు అధ్యాపకులను విధుల్లోంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కొన్ని కోర్సులకు కనీస సంఖ్యలో లెక్చరర్లు లేరని జేఎన్‌టీయూ గుర్తించింది. దీంతో సదరు కాలేజీలపై కఠిన చర్యలకు పూనుకుంది. లెక్చరర్లు లేని కోర్సులకు గుర్తింపు నిలిపివేసినట్లు ప్రకటించింది.
Also Read: తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్
ఏదైనా కాలేజీలో నిర్దేశించిన సంఖ్య కంటే 50 శాతం తక్కువగా లెక్చరర్లు ఉన్న బ్రాంచీ (కోర్సు) లలోని సీట్లకు అనుమతి దక్కలేదు. దీని ప్రకారం వర్సిటీ పరిధిలో ఉన్న 16 కాలేజీల్లో పలు బ్రాంచీలలో కలిపి మొత్తం 3 వేల సీట్లకు అనుమతి నిలిపివేసినట్లు సమాచారం. ఒకరు, ఇద్దరు లేదా తక్కువగా ఉంటే వీలైనంత త్వరగా అధ్యాపకులను నియమించుకోవాల్సిందిగా కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. ఇక ప్రిన్సిపాళ్లు లేని కాలేజీలకు సైతం పలు షరతులతో కూడిన అఫిలియేషన్‌ను మంజూరు చేసింది. ఈ కాలేజీలు రెండు నెలల లోపు ప్రిన్సిపాళ్లను నియమించుకోవాలని పేర్కొంది.
సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీ..
ఈ ఏడాది నుంచి జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం కానుంది. దీనిలో 6 బ్రాంచీలతో కలిపి 320 సీట్లు ఉంటాయి. ఈసీఈ, సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, మెకానికల్ విభాగాల్లో 60 చొప్పున సీట్లు ఉన్నాయి. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో 20 సీట్లు కేటాయించారు. ఈ కాలేజీకి జేఎన్‌టీయూ అఫిలియేషన్ సైతం మంజూరు చేసింది. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లను భర్తీ చేసేందుకు వీలు కల్పించింది.
11 నుంచి వెబ్ ఆప్షన్లు..
తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఎల్లుండి (ఈ నెల 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి అధికారులు కాలేజీల జాబితాను ఎంసెట్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 143 కాలేజీల వివరాలను పొందుపరిచారు. ఇందులో జేఎన్‌టీయూ, ఓయూ పరిధిలోని 119 ప్రైవేటు, 24 ప్రభుత్వ కాలేజీలకు స్థానం దక్కింది. ఈ రోజు మధ్యాహ్నానికి జేఎన్‌టీయూ పరిధిలోని మరో 23 కాలేజీలకు గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు.
Also Read: Amazon sale: రూ.16 వేలకే 40 ఇంచుల టీవీ... త్వరగా బుక్ చేసుకోండి