Janareddy Congress : బీఆర్ఎస్‌తో పొత్తుల ప్రశ్నే ఉండదని రేవంత్ రెడ్డి అంటూంటే ఆ పార్టీ సీనియర్ నేతలు మాత్రం తరచూ పొత్తుల ప్రస్తాన తీసుకు వస్తున్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈ బాధ్యతను తాజాగా మరో సీనియర్ నేత జానారెడ్డి తసుకున్నారు. తప్పదనుకుంటే బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యనించేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తన కొడుకు వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా బీఆర్ఎస్ ఉందన్న జానారెడ్డి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఈరోజు ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. అందులో భాగంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ‘‘మోదీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి’’ అని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తోందని, కేంద్ర నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని జానారెడ్డి తెలిపారు. కేంద్రం తీరుపై 17 ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.
గతంలో బీఆర్ఎస్‌తో పొత్తుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు చెప్పారు. రాహుల్ కేసులు పెడితే బీజేపీ వాళ్లంతా జైల్లో ఉంటారని హెచ్చరించారు. పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేసేందుకే అనర్హత వేటు వేశారన్నారు.ఇప్పుడు జానారెడ్డి పొత్తులపై చేసిన కామెంట్లతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం ప్రారంభమయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులు ఉండే అవకాశం ఉందని.. పెట్టుకోక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఓ సారి చేసిన వ్యాఖ్యలపై నేతలు భగ్గుమన్నారు. సెక్యులర్ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమయ్యాయి. ఇప్పుడు జానారెడ్డి నోటి వెంట కూడా ఈ సెక్యూలర్ పార్టీల పొత్తు ప్రస్తాన వచ్చింది.
బీఆర్ఎస్‌తో పొత్తు ప్రశ్నే ఉండదంటున్న రేవంత్
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోరుకుంటున్నారని కొంత కాలంంగా ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఒంటరిగానే అధికారంలోకి వస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇతర సీనియర్లు మాత్రం భిన్నమైన రాజకీయంతో వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్‌లో కొత్త అలజడికి కారణం అవుతోంది.