Jaggu Swamy ;   తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పంపిన 41A CRPC నోటీసులతో పాటు.. లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని జగ్గుస్వామి కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని అక్రమంగా కేసులో తన పేరుని చేర్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం విచారిణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జగ్గుస్వామికి ఈ కేసులో ప్రమేయం ఉందని, ఆయన ఈ కేసులో కీలక నిందితులైన తుషార్ మరియు రామచంద్ర భారతిలకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్‌ నారాయణ జగ్గు అలియాస్‌ జగ్గు స్వామి ఫోన్‌ సంభాషణలు రికార్డయ్యాయి.
 
రామచంద్రభారతి తన ఫోన్‌లో జగ్గు స్వామికి ‘విటమిన్‌ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్‌ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్‌ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్‌ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌ లకు 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.


ఈ ముగ్గూరు   కేరళ హైకోర్టులో   పిటిషన్ వేసి.. ఐదో తేదీ వరకూ అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జగ్గు స్వామి అనే వ్యక్తితో తాము సన్నిహితంగా ఉన్నందున  తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారు కోర్టులో వాదించారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కేరళ హై కోర్టు ఈ ముగ్గురినీ పోలీసులు ఇప్పటివరకు నిందితులుగా పేర్కొనలేదని అభిప్రాయపడింది. ఈ నెల 5న ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునేంత వరకు వీరిని అరెస్టు చేయవద్దంటూ తాత్కాలిక రక్షణ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని తన ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని కోరుతూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) నోటీసులు జారీ చేయడంతో ఈ ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. 


తెలంగాణలోని రాజకీయ కుట్రలో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఈ ముగ్గురు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు యత్నం కేసులో బిజెపి సీనియర్ నేత బిఎల్ సంతోష్, కేరళకు చెందిన జగ్గూ స్వామి, తుషార్ వెల్లపల్లి, బి శ్రీనివాస్‌లు సిట్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బీఎల్ సంతోష్ కు జారీ చేసన నోటీసులపై తెలంగాణ హైకోర్టు ఐదో తేదీ వరకూ స్టే విధించింది. ఈ కేసులో సిట్ ఎదుట ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల వారు ఎవరూ హాజరు కాలేదు. కరీంనగర్ లాయర్ శ్రీనివాస్, నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు మరో లాయర్ ప్రతాప్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు.