Jaggareddy Meets KCR : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఈ మీటింగ్ జరిగింది. సంగారెడ్డి వరకూ మెట్రోను పొడిగించాలని విజ్ఞప్తి చేసేందుకు... సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై విజ్ఞాపనులు చేసేందుకు సీఎంను కలిశానని.. జగ్గారెడ్డి చెబుతున్నారు. తానేమీ చీకట్లో కేసీఆర్ ను కలవలేదని చెబుతున్నారు. అభివృద్ధి పనుల కోసం ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పు లేనిది ఎమ్మెల్యేగా తాను సీఎంను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం తన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారని.. మరోసారి కలవాలని సూచించారని జగ్గారెడ్డి చెబుతున్నారు.
జగ్గారెడ్డి సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తానని చాలా సార్లు ప్రకటించారు. ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నించారు. కానీ ఎప్పుడూ అవకాశం చిక్కలేదు. ఇటీవల కాలంలో ఆయన కేసీఆర్ పై విమర్శలు కూడా చేయడం లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి హరీష్ రావుపై మాత్రం విమర్శలు చేస్తూంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సీఎం కలుస్తానని చాలా సార్లు చెప్పారు. అయితే జగ్గారెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని రెండేళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తూండటంతో ఆయనపై కోవర్ట్ అనే ముద్ర వేశారు. దీనపైనా జగ్గారెడ్డి ఫైరయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయులు ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసమ్మతి నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ కారణంగా జగ్గారెడ్డి ఏం చేసినా.. సంచలనంగా మారుతోంది. జగ్గారెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది టీఆర్ఎస్ పార్టీ నుంచే. తర్వాత ఆయన పార్టీతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ టైంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఓ సారి బీజేపీలో చేరినా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు.
కాంగ్రెస్‌లో ఆయన ఇమడలేకపోతున్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనను ఆహ్వానించే పార్టీ లేదు. బీజేపీలో చేరలేరు. బీఆర్ఎస్‌లో చేరేందుకు స్థానిక నేతలు అడ్డం పడతారు. ఇలాంటి పరిణామాలతో జగ్గారెడ్డికి పార్టీ మారే చాన్స్ లేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కేసీఆర్‌తో సమావేశం కావడం.. అందులో తప్పేముందని సమర్థించుకోవడంతో ఆయనపై మరోసారి గుసగుసలు ప్రారంభమయ్యే అవకాశంఉంది.
అయితే జగ్గారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి అమిత్ షా, మోదీలతో పలుమార్లు సమావేశం అయ్యారు. అది తప్పు కానీ సీఎంగా ఉన్న కేసీఆర్ కలవడం తప్పేమిటన్న లాజిక్ ను ఆయన వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో లైన్ క్లియర్ అయితే.. సంగారెడ్డి టిక్కెట్ ను కేసీఆర్ ఆఫర్ చేస్తే జగ్గారెడ్డి పార్టీ మారిపోవచ్చన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.