MLA Anirudh Reddy comments defending Minister Komatireddy :   రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన అత్యంత భావోద్వేగంగా మాట్లాడుతూ, కోమటిరెడ్డిని 'శ్రీరాముడి'తో పోల్చారు. ఒక దేవుడి లాంటి వ్యక్తిపై ఇలాంటి నీచమైన ప్రచారాలు చేయడం చూస్తుంటే రక్తం మరుగుతోందని, ఈ బాధతో తాను గత మూడు రోజులుగా తిండి కూడా తినలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సాగుతున్న ఈ కుట్రల వెనుక ఎవరున్నారో త్వరలోనే తేలుతుందని ఆయన హెచ్చరించారు.

Continues below advertisement

మంత్రిపై వస్తున్న ఆరోపణలను సాంకేతికంగాను, వ్యక్తిగతంగాను అనిరుధ్ రెడ్డి తిప్పికొట్టారు. మంత్రికి గత కొంతకాలంగా ఉన్న  గొంతు సమస్య  వల్ల ఆయన మాటలో వచ్చే మార్పులను ఆసరాగా చేసుకుని, కొందరు పనిగట్టుకుని అపనిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.  మంత్రి  కోమటిరెడ్ిడ దాపరికం తెలియదు, కనీసం ఆయన మొబైల్‌కు లాక్ కూడా ఉండదు. అంతటి నిప్పు లాంటి మనిషిపై బురద చల్లడం దారుణం అని పేర్కొన్నారు. తాను కోమటిరెడ్డికి వీరాభిమానినని, ఆయన బావిలో దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నానని, ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తానంటూ తన విధేయతను చాటుకున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారికంగా విచారణ జరుగుతోందని, త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయని అనిరుధ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు లేదా గిట్టని వారు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని, ఇలాంటి కుతంత్రాలకు కాంగ్రెస్ శ్రేణులు భయపడవని స్పష్టం చేశారు. మంత్రికి పార్టీ మొత్తం అండగా ఉంటుందని, విచారణలో ఆయన నిర్దోషిగా తేలుతారని ధీమా వ్యక్తం చేశారు. ఒక మేరునగ ధీరుడిపై జరుగుతున్న ఈ దాడిని ప్రజలు కూడా గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేసే వారికి కాలమే సమాధానం చెబుతుందని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.

Continues below advertisement

కోమటిరెడ్డిపై ఏం ప్రచారం జరుగుతోందంటే? 

మంత్రి , మరో మహిళా ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా ఉంటున్నారని ఓ వార్తా చానల్ లో వార్తా కథనం ప్రసారం అయింది. ఆ మంత్రి కోమటిరెడ్డేనని ప్రచారం  జరిగింది. దీంతో కోమటిరెడ్డి మీడి ముందుకు వచ్చి..  తన ఆరోగ్యంపై కావాలనే కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడు చనిపోయినప్పుడే తానుసగం చనిపోయానని.. ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు చేసే  బదులు  విషమిచ్చి చంపేయాలన్నారు. ఆయన సీరియస్ కావడంతో ప్రభుత్వం ఈ అంశంలో విచారణకు సిట్ ను నియమించింది. ముగ్గురు జర్నలిస్టుల్ని అరెస్టుచేయడంతోపాటు పెద్ద ఎత్తున యూట్యూబ్ చానళ్లకు నోటీసులు ఇవ్వడంతో ఈ అంశం దుమారం రేపుతోంది. అందుకే కోమటిరెడ్డికి  మద్దతుగా అనిరుథ్ రెడ్డి స్పందించారు.