Heavy Rains In Telangana In Coming Three Days: తెలంగాణకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ అందించింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తపేట సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదన్నపేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


3 రోజులు వర్షాలు


రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఆదివారం.. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించారు. గంటకు 30 - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం.. సిద్ధిపేట, యాదాద్రి భునవగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.


ఏపీలో ఇదీ పరిస్థితి


అటు, ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో అక్కడకక్కడ శుక్రవారం వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. శనివారం.. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


Also Read: Telangana Politics : సింగరేణికి బొగ్గు గనుల బాధ్యత ఎవరిది ? బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త పంచాయతీ !