Imd Orange Alert To Districts in Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం దాలుస్తున్నాడు. తెలంగాణలో (Telangana) ఎండలు దంచికొడుతుండగా.. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 27 నుంచి 30 వరకూ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 5 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సత్నాల, తలమడుగులో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. చాప్రాల 42.1, ఆసిఫాబాద్ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


అధికంగా పగటి ఉష్ణోగ్రతలు


తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని  21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవత్ర కనిపించగా.. గత వారం మాత్రం అకాల వర్షాలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట సైతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అధిక వేడి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.


ఏపీలోనూ..


ఏపీలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో మరో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ దిశగా, లేక నైరుతి దిశ వైపు గాలులు వీచనున్నాయని వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాలతో పోల్చితే రాయలసీమలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాలలో 41 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ వేడి గాలుల ప్రభావం ఉంటుంది.  2 నుంచి 3 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రత పెరిగే ఛాన్స్ ఉందని, ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. రాయలసీమకు స్వల్ప వర్ష సూచన ఉంది. అదే సమయంలో కొన్నిచోట్ల వేడి గాలుల ప్రభావంతో ఉక్కపోత అధికం కానుంది. 


Also Read: Brs Mlc Kavitha: తీహార్ జైలుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత - ఇంటి భోజనం సహా కొన్నింటికి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు