Rains in Andhra Pradesh and Telangana| హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు వచ్చింది. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండగా.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణతో పాటు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ శుభవార్త అందించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. మే 19 నాటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలో ప్రవేశించే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో మరో నాలుగు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం రెండు రోజుల్లో బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. సోమవారం (మే 20న) 30, 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం, నీట మునిగిన రోడ్లు
హైదరాబాద్‌లో శనివారం భారీ వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మేడ్చల్, దుండిగల్, ప్రగతినగర్, నిజాంపేట్, కండ్లకోయ, గండిమైసమ్మ, హయత్నగర్, పెద్ద అంబర్పేట, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పటాన్‌చెరు, ఆర్సీ పురం, అమీన్ పూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. బేగంపేట్, ప్యారడైజ్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, జవహర్‌నగర్, చిలకలగూడలోనూ జోరుగా వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వెళ్లే విజయవాడ రహదారి రోడ్లు చెరువులా మారిపోయాయి. వర్షపు నీరు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఆది, సోమవారాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.