Rain Alert To Telangana: తెలంగాణలో (Telangana) భానుడు నిప్పులు కురిపిస్తోన్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు కూల్ న్యూస్ అందించింది. రాగల 5 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించిన అధికారులు.. ఈ మేరకు ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే, కొన్ని జిల్లాల్లో వడగాలులు కూడా కొనసాగే అవకాశాలున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు, ఆదివారం ములుగు జిల్లా భారీ వర్షంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల గాలి వేగానికి ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఆకస్మిక వర్షాలతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.






ఈ జిల్లాల్లో వర్షాలు






ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.


మంగళవారం సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. బుధ, గురువారాల్లోనూ పలు చోట్ల భారీ, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.


ఏపీలోనూ వర్షాలు


మరోవైపు, ఏపీలోనూ అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్న క్రమంలో అమరావతి వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అటు, ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి సహా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.


Also Read: KTR Comments: రేవంత్ రెడ్డి చీర నువ్వు కట్టుకుంటావా? లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు