Telangana Crime News: హైదరాబాద్‍(Hyderabad)లో కలకలం సృష్టించిన రియాల్టర్ హత్యకు పాతకక్షలే కారణమని తేలింది. పదిమంది కలిసి అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చారు. మృతుడి ఒంటిపై దాదాపు 50కు పైగా కత్తిపోట్లు ఉన్నాయంటే ఎంత కక్షపెంచుకున్నారో అర్థమవుతోంది. పైగా చంపుతున్న దృశ్యాలను స్నేహితుకి వీడియో కాల్‌లో చూపించినట్లు తెలిసింది. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని తేలింది.


దారణంగా హతమార్చారు
హైదారాబాద్ యూసఫ్‌గూడ(Yousufguda)లో జరిగిన మర్డర్‌(Murder) కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి ఒంటిపై లెక్కకు మిక్కిలి కత్తిపోట్లు ఉండటం చూసి పోలీసు(Police)లే హతాశులయ్యారు. మర్డర్ జరిగిన తీరు చూస్తే... కక్షపెట్టుకుని చంపినట్లు అనుమానించారు. పోలీసుల అనుమానం నిజం చేస్తూ...ఈ హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేసిన రాము(Ramu)... ఇటీవలే ఈ ఫీల్డులోకివచ్చాడు.


వ్యాపారంలో భాగంగా...జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే మరో వ్యాపారితో పరిచయం అయ్యింది. ఇద్దరూ కలిసి చాలారోజులుగా వ్యాపారం చేస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో చిన్నపాటి గొడవలు కాస్త ముదిరాయి. డబ్బులు పంపకంలో తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్‌లో కేసులు సైతం పెట్టుకున్నారు. ఇరుపక్షాలకు చెందిన సన్నితులు సర్దిచెప్పినా....గొడవలు సద్దుమణగలేదు. దీంతో రాముపై మణికంఠ(Manikanta) మరింత కక్ష పెంచుకున్నాడు. అతని అడ్డుతొలగించుకుంటే తప్ప తన పగ చల్లారదని భావించాడు. రాము వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోగా...అకారణంగా తనపై పోలీసుస్టేషన్ లో కేసు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతన్ని చంపితే గానీ తన మనసు కుదుటపడదని లోలోపల రగిలిపోయాడు. దీనికోసం బోరబండకు చెందిన రౌడీషీటర్ తో బేరం కుదుర్చుకున్నాడు. రాముని చంపి తన పగ చల్లార్చుకోవాలని పథకం రచించాడు.


హత్యకు పథకం
రాముపై కక్షపెంచుకున్న మణికంఠ...ఎలాగైనా అతని అడ్డుతొలగించుకోవాలని భావించాడు. పకడ్బందీగా హత్యకు పథకం రచించిన మణికంఠ...వారం రోజులుగా అదును కోసం ఎదురుచూస్తున్నాడు. రెండురోజులపాటు రెక్కీ నిర్వహించాడు.ఈనెల 5న రాము యూసఫ్‌గూడలో ఉన్నాడని తెలుసుకుని హానీట్రాప్(Honey Trap) పథకం అమలు చేశాడు. ఓ యువతితో ఫోన్ చేయించి...యువతి ఇంటికి పిలిపించాడు. ఎల్‌ఎన్‌నగర్‌లోని యువతి ఇంట్లో ఉన్న సమయంలో మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీషీటర్ మరో ఎనిమిదిమంది కలిసి కత్తులతో నరికి చంపారు. దాదాపు 50కి పైగా కత్తిపోట్లు పొడిచారు. హత్య జరుగుతున్న సమయంలోనే మణికంఠ తన స్నేహితుడు ఒకరికి వీడియోకాల్‌లో చూపించారు.దీన్ని బట్టి రాముపై మణికంఠం ఏ మేరకు కక్షపెంచుకున్నాడో అర్థమవుతుంది. అందుకే స్వయంగా హత్యలో తాను కూడా పాల్గొన్నాడు.


యువతి ద్వారానే వెలుగులోకి
హత్యకు ముందు యువతి రాముకు ఫోన్‌ చేసినట్లు గుర్తించిన పోలీసులు...ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మణికంఠ చెబితేనే తాను రాముకు ఫోన్ చేసి పిలిపించినట్లు ఆమె వెల్లడించింది. దీంతో పరారీలో ఉన్న మణికంఠతో పాటు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పల్లెటూరు నుంచి బతుకుదెరువుకోసం పట్నం వచ్చి అత్యంత దారుణంగా చంపబడ్డాడంటూ మృతుడి బందువులు ఆవేదన వ్యక్తం చేశారు