World Forest Day 2022 AT KBR Park Hyderabad: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర ప్రముఖులు మొక్కలు నాటి ప్రజలకు సైతం పిలుపునిచ్చారు.


కేబీఆర్ పార్క్ (KBR National Park ) ఖాళీ స్థలంలో చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ (Chief Justice of Telangana High Court) మర్రి మొక్కను నాటగా, జస్టిస్ నవీన్ రావు నేరేడు మొక్కను నాటారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో దేశ వ్యాప్తంగా మొక్కల పెంపకం, వాటి ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ వేప మొక్కను నాటారు. తెలంగాణలో హరితహారం ద్వారా జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ కు అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ వివరించారు. 






మొక్కలు నాటిన అనంతరం చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అతిథులు కేబీఆర్ పార్కులో కాసేపు వాకింగ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు చాలా బాగున్నాయి అని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర చెప్పారు. 


అటవీ దినోత్సవ శభాకాంక్షలు
పర్యావరణ ప్రేమికులు అందరికీ ఎంపీ సంతోష్ కుమార్ ప్రపంచ అటవీ దినోత్సవ శభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే మార్గమని సూచించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ మూడు పీ విధానాన్ని అనుసరించాలన్నారు. పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటక్ట్‌ల (Three P - Participate, Plant, Protect)ను విధిగా అనుసరించాలని పిలుపునిచ్చారు.