వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్‌ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పబోతోంది ? ఇది టీఆర్‌ఎస్‌ వ్యూహంలో భాగమా? లేదంటే  విపక్షాలకు హెచ్చరిక లాంటిదా ? తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడిదే చర్చ. 


ఒక్క ఘటన చాలు రాజకీయ పార్టీలు మైలేజ్‌ పెంచుకోవడానికి. ఇప్పుడలాంటి సంఘటనే వైఎస్‌ఆర్‌టీపీ విషయంలోనూ జరుగుతోంది. నిన్నటి వరకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురిగా తెలంగాణ ప్రజలకు తెలిసిన షర్మిల ఇప్పుడు అధికార పార్టీనేతల దాడులు, అరెస్ట్‌లతో బలమైన విపక్ష నేతగా మారే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు తెలంగాణలో జరిగిన షర్మిల పాదయాత్రకు రానంత క్రేజ్‌ ఇప్పుడు ఆమె అరెస్ట్‌తో వచ్చిందని టాక్. 


అసలింతకీ షర్మిల అరెస్ట్‌ వెనక ఉన్న మ్యాటర్‌ ఏంటీ అన్నదే ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ. తెలంగాణలో షర్మిల పాదయాత్ర మూడువేల కిలోమీటర్లకుపైగానే సాగింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె జనాల్లోనే ఉన్నారు. అధికారపార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు స్పందించని టీఆర్‌ఎస్‌నేతలు, శ్రేణులు ఇప్పుడెందుకు దాడులకు దిగారు. అరెస్ట్‌లు చేస్తున్నారన్నదే ప్రశ్న. 


ఇదంతా రాజకీయ ఎత్తుగడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీని దెబ్బతీసేందుకే టీఆర్‌ఎస్‌ ఆడుతున్న డ్రామాగా చెబుతున్నారు. కాషాయం పార్టీ తెలంగాణలో పాపులర్‌ కావడానికి కారణం ఆపార్టీ నేతల మాటలు, చేతలేనన్నది కొందరి వాదన. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఉపఎన్నికలతో బీజేపీ బలం పెరిగింది. రాష్ట్ర నేతలకు తోడు బీజేపీ జాతీయనాయకులు కూడా తెలంగాణపై గురి పెట్టారు. మీడియా అంతటా బీజేపీకి సంబంధించిన వార్తలే హైలెట్‌ అవుతున్నాయి. దీంతో ప్రజల్లోనూ కాషాయంపై కాన్సట్రేషన్‌ పెరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అతి కష్టం మీద గెలిచింది అంటే బీజేపీ బలం పెరుగుతోందని గులాబీ శ్రేణులకు కూడా అర్థమయ్యిందట. అందుకే కాషాయం కనిపించకూడదు... వినిపించకూడదన్న ఉద్దేశ్యంతో కారు పార్టీ షర్మిలని టార్గెట్‌ చేసిందంటున్నారు కొందరు విశ్లేషకులు. 


బండి సంజయ్‌ తన ప్రజాసంకల్ప పాదయాత్ర రీస్టార్ట్ చేశారు. ఆ పార్టీ పెద్దలు కూడా తెలంగాణలో సభలు, సమావేశాలంటూ హడావుడి చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చేందుకే టీఆర్‌ఎస్‌ నేతలు వైఎస్సార్‌టీపీని టార్గెట్ చేశారట. ఇంతకుముందు షర్మిల కెసిఆర్‌పై, మంత్రులపై చాలా విమర్శలే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్తంత హద్దులు దాటారు. కానీ అప్పుడు ఎలాంటి కౌంటర్లు ఇవ్వని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇప్పుడెందుకు దాడులు, అరెస్ట్‌లు చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్‌ వ్యూహంలో భాగమే ఈ అరెస్ట్‌లన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 


ఈ వాదనను అధికారపార్టీ నేతలు ఖండిస్తున్నారు. కెసిఆర్‌పై అర్థంపర్థంలేని ఆరోపణలు, విమర్శలు చేస్తే షర్మిలకి పట్టిన గతే ఇతర పక్షాలకు పడతాయన్న రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది వైఎస్‌ఆర్‌టీపీ ఎత్తుగడ అంటున్నారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకు పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించుకునేందుకు షర్మిల అనవరసరాద్ధాంతం చేస్తున్నారన్న టాక్‌ కూడా ఉంది. 


కాంగ్రెస్‌ ఇంటిపోరుతో వార్తల్లో ఉంటుంటే బీజేపీ నేతలు కెసిఆర్‌పై, గులాబీ నేతలపై ఈడీ-ఐటీ దాడులతో ప్రజల్లోకి అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపికి బలమున్నా బలమైన నాయకుడు లేకపోవడంతో పసుపు పార్టీ గురించి తెలంగాణలో పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ టైమ్‌లో పార్టీ పెట్టి తెలంగాణ కోడలినంటూ వచ్చిన షర్మిల రాష్ట్రంలో పాగా వేసేందుకునానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో జరిగిన దాడులు తదనంతరం జరిగిన అరెస్ట్‌లను ఆ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. దివంగత సిఎం భార్య, షర్మిల తల్లిని కూడా పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేయడంతో ఈ ఘటన సర్వత్రా చర్చకు కారణమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో జగన్‌ పై ఇలానే కోడికత్తి దాడి ఘటన జరిగింది. అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించిందో తెలిసిందే. భవిష్యత్‌లో షర్మిలకు కూడా ఈ అరెస్ట్‌ కలిసొస్తుందని జోస్యం చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు.