TPCC అధ్యక్షుడ్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆ మీడియాలో కథనాలతో బద్నాం చేయాలని చూస్తున్నారా?
TPCC మహేష్ కమార్ గౌడ్ , ఏఐసీసీ వ్యావహారాల ఇంఛార్జ్ మీనాక్షి నాటరాజ్ లు ఓ వర్గం, సీఎం రేవంత్ టీమ్ మరో వర్గంగా విడిపోయి పార్టీలో అంతర్గత పోరు జరుగుతోందనే విమర్శలున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా మీడియా ఛానెల్లో తాజాగా ప్రసారమవుతున్న వరుస కథనాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవునా.. నిజమా.. మా ఛానెల్ ల్లోనే, మా పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఈ వరుస కథనాలేంటి. పీసీసీ అధక్షుడ్ని టార్గెట్ చేయడం వెనుక ఎవరున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. తెలుగు శాటిలైట్ మీడియా ఛానెల్స్ లో ప్రభుత్వానికి అనుకూల వార్తలు ప్రసారం చేస్తుందనే విమర్శలున్న ఓ బడా ఛానెల్ లో గత రెండు రోజుల నుండి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా వరుస కథనాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి, ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు ఆ పెద్ద ఛానెల్ దూరంగా ఉంటుంది. అన్నీ అనుకూల కథనాలే వస్తాయే తప్పా, కాంగ్రెస్ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక, పాలనాపరమైన లోపాలు ఆరోపణల వార్తల విషయంలో ఆచీతూచీ అడుగులేస్తారనే వాదనలూ ఉన్నాయి. అయితే తాజాగా ఇవన్నీ బ్రేక్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడిపై వ్యతిరేక వార్తలను నాన్ స్టాప్ గా ప్రసారం చేస్తూనే ఉన్నారు.
డిజాస్టర్ టీపీసీసీప్రెసిడెంట్ నిజమేనా..?
డిజాస్టర్ ప్రెసిండెంట్, ఏఐసీసీ విశ్వాసం కోల్పోయిన అధ్యక్షుడు, క్యాడర్ ను కన్నెత్తి చూడని పీఠాధిపతి, అధ్వానంగా గాంధీ భవన్. సారు కోసం ఇంద్రభవనం... ఇలా వరుస కథనాలతో మహేష్ కుమార్ గౌడ్ ను బద్నాం చేయడం వెనుక పెద్ద కుట్ర నడుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా అధికారం చేపట్టి 20 నెలలు దాటింది. ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక ఎన్నికల్లో విజయం సాధించింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 50శాతం పైగా సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ లో 5 మున్సిపాలిటీలు గెలిచింది. అత్యంత ప్రతీష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం గెలుపు జెండా ఎగరేసింది. మరి ఇంతలా వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం చూపిస్తుంటే, మహేష్ కమార్ గౌడ్ అధక్షుడిగా ఎక్కడ విఫలమైయ్యారు. ఎందుకు ఈ వండి వార్చిన కథనాలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహేష్ కుమార్ మార్క్.. ఎక్కువైయ్యిందనే టార్గెట్ చేశారా..?
ప్రసారమవుతున్నట్లుగా గాంధీ భవన్ లో బీరు బాటిళ్లకు, గోడకు ఊడుతున్న పెచ్చులకు అధ్యక్షడికి ఏం సంబంధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహేష్ కుమార్ గౌడ్ కు ముందు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో ఉన్నారు. అప్పుడూ గాంధీ భవన్ పరిస్దితి ఇలాగే ఉంది. కానీ ఇప్పుడు అన్నీ మహేష్ కుమార్ గౌడ్ ఖాతాలోనే వేయడం వెనుక పెద్ద ప్లానే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలున్నా ఆ బడా ఛానెల్ లో ఇట్లా టార్గెట్ కథనాలు రావడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం సైతం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ హచ్ చేస్తున్నాయి.
సీఎం పదవి దక్కిన తరువాత టీపీసీసీ విషయంలో రేవంత్ రెడ్డి ఆచీతూచి నిర్ణయం తీసుకున్నారని, తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ అధ్యక్షుడి పదవి దగ్గడంలో కీలక పాత్ర పోషించారనే వాదనలున్నాయి. ఇన్నాళ్లు అత్యంత సన్నిహితంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ పై ఇలా అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తుంటే, పనిగట్టుకు మరీ పార్టీ పరువు తీస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారనేవారు లేకపోలేదు. రాష్ట్ర వ్యవహరాలు తనకు తెలియకుండా నేరుగా ఢీల్లీకి సమాచారం ఇస్తున్నాడని, బండి విషయంలోనూ పార్టీ పరువు పోయేలా వ్యవహరించారనేది హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారని, ముఖ్యంగా ఇటీవల కాలంలో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మళ్లీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, బీసీ అభ్యర్ది ఈసారి సీఎం అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు రేవంత్ ఆగ్రహానికి కారణమయ్యాయనే వాదనలూ ఉన్నాయి. వీటికితోడు ఆ కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా ఛానెల్ కు చెందిన బంధువుకు మహబూబాబాద్ డీసీసీ పదవి ఇవ్వలేదని కావాలనే టార్గెట్ చేశారనే ఆరోపణలున్నాయి.
రెండు గ్రూపులుగా తెలంగాణ కాంగ్రెస్..!
తెలంగాణ కాంగ్రెస్ అంటే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అనే విమర్శలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కాస్త కట్టడి చేసినప్పటికీ , తాజాగా టీపీసీసీని ప్రభుత్వ అనుకూల మీడియా ఛానెల్ టార్గెట్ చేయడంతో మళ్లీ గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చినట్లయ్యింది. ఇప్పటికే మహేష్ కమార్ గౌడ్ , ఏఐసీసీ వ్యావహరాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాటరాజ్ లు ఓ వర్గం, సీఎం రేవంత్ టీమ్ మరో వర్గంగా విడిపోయి పార్టీలో అంతర్గత పోరు జరుగుతోందనే వాదనలున్నాయి. వెలుగుమట్ల, హెచ్ సీయూ ల్యాండ్ విషయంలో రేవంత్ కు వ్యతిరేకంగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవడం వెనుక మహేష్ హస్తం ఉందని అందుకే టీపీసీసీని టార్గెట్ చేస్తున్నారని వినిపిస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తరువాత పార్టీ కేడర్ ను కలుపుకు పోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.
Also Read: హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!
ప్రభుత్వ పధకాలను రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ద్వారా గ్రామాల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడ్డారనేవారు లేకపోలేదు. గాంధీ భవన్ కు వచ్చుడు తక్కువ, విదేశాలకు వెళ్లడం ఎక్కువ అనే ఆరోపణలున్నాయి. ఇలా వీటిలో కొంత వరకూ వాస్తవాలున్నప్పటికీ , టీపీసీసీ వల్లనే పార్టీ తిరిగి అధికారంలోకి రాదని, ప్రభుత్వ పనితీరే మళ్లీ గెలిపించాలా వద్దా అని డిసైడ్ చేస్తుందనేవారు లేకపోలేదు. ఇలా సాకులు కావాలంటే లక్షల్లో వెతకొచ్చు. వదిలేయాంటే అంతకు మించి ఉన్నా లైట్ తీసుకోవచ్చు అనేలా ప్రస్తుత తీరు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మహేష్ కుమార్ ను పొమ్మనలేక పొగపెట్టేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలితో కలసి విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ తనపై మీడియాలో ప్రసారమవుతున్న కథనాలకు కార్యకర్తలు అధైర్య పడొద్దని, మీడియాను గౌరవించడం మన భాద్యత, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందంటూ ప్రకటన విడుదల చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















