Telangana Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది ఏపీ ఇంటర్ బోర్డు. అదే టైంలో పరీక్షలు అయిన తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రక్రియ పూర్తి అయినట్టు తెలుస్తోంది. పది రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నామని చెబుతున్నారు. 

తెలంగాణ ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకం ఇప్పటికే పూర్తి అయింది. ఆ మార్కులను డిజిటలైజ్ చేస్తున్నారు. విద్యార్థుల మార్క్‌లిస్ట్‌లు రెడీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయింది. విద్యాశాఖ మంత్రి సమయం ఇచ్చినదాని బట్టి వచ్చే వారం విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. లేకుంటే మరో రెండు మూడు రోజులు అటు ఇటుగా ఫలితాలు విడుదల చేయనున్నారు. 

2024 మినహా ఎప్పుడు కూడా తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేసింది లేదు. గతేడాది ప్రభుత్వంతో సంబంధం లేకుండా అధికారులే నేరుగా విడుదల చేశారు. ఎన్నికలు ఉన్నందున అధికారులు ఫలితాలు రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం ఉంది. దాని కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

ఏ సంవత్సరంలో ఎప్పుడు ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయో పరిశీలిస్తే... 2021లో జూన్ 28, 2022 జూన్ 28, 2023మే9, 2024 ఏప్రిల్‌ 24న ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది కంటే ఒకట్రెండు రోజులు ముందుగానే రిజల్ట్స్‌ విడుదల చేయనున్నారు. 

తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు మార్చి 5 ప్రారంభమై మార్చి 25తో ముగిశాయి. వెంటనే మూల్యాంకనం కూడా పూర్తి చేశారు. ఈ ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఏబీపీ దేశం కూడా ఫలితాలు వెబ్‌సైట్‌లో పెట్టనుంది.  

ఈ సంవత్సరం ఎంత మంది పరీక్షలు రాశారుఈ ఏడాది రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,96,971 మంది పరీక్షలు రాశారు. వీరిలో 4,80,415 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా... 4,44,697 మంది రెండో సంవత్సరం చదివిన వాళ్లు. 

గతేడాది ఫలితాలు చూస్తే... 2024సంవత్సరంలో ఇంటర్ ఫలితాలును ఏప్రిల్ 24వ తేదీని విడుదల చేశారు. 64.19 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 72.53శాతం ఉంటే బాలురు 56.1 శాతం మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సర ఉత్తీర్ణత శాతంలో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు టాప్‌లో నిలిచింది. 44.29 శాతంతో కామారెడ్డి ఆఖరి స్థానంలో ఉంది. మొదటి సంవత్సరం 60.01 శాతం మంది పాస్ అయ్యారు. ఇందులో ఇందులో బాలికలు 68.35 శాతం ఉంటే బాలురు 51.5 శాతం మంది పాస్ అయ్యారు. టాప్‌లో రంగారెడ్డి జిల్లా 71.7 శాతంతో టాప్‌లో ఉంటే కామారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో 34.81 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.