Miss World Opal Suchata on Charminar Fire accident | హైదరాబాద్: నా గుండె తరుక్కుపోతోంది అంటూ చార్మినార్ అగ్నిప్రమాదంపై మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ స్పందించారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన తొలి రోజుల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చార్మినార్ సందర్శించారు. అక్కడ తనతో కలిసి ఫొటో దిగిన ముగ్గురు చిన్నారులు ఇప్పుడు మన మధ్యలేరు, వీరి కుటుంబసభ్యులు సైతం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత భావోద్వేగానికి లోనయ్యారు. 

హైదరబాద్‌కు ప్రత్యేక స్థానం

మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న హైదరాబాద్ నగరం అంటే తనకు ఎంతో ఇష్టం. నగరవాసులు తనపై చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఆమె ముగ్దురాలు అయ్యారు. కానీ అదే సమయంలో నగరంతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన ఘటన నన్ను కలచివేస్తోంది. జరిగిన సంఘటనను మరిచిపోలేకపోతున్నారు. 

ఇటీవల మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన తొలి రోజుల్లో ప్రభుత్వం అవకాశం కల్పించడంతో చార్మినార్‌లోని ఒక అందమైన ముత్యాల దుకాణాన్ని సందర్శించాను.  హైదరాబాద్ అనేది థాయిలాండ్‌లోని నా హోం లాంటి నగరం. ఇక్కడి ప్రజలు నాకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఎంతో ప్రేమను ఇచ్చారు. 

చిన్నారులను అందంగా ముస్తాబు చేసిన తల్లి..

నేను చార్మినార్ వెళ్లిన సమయంలో ముత్యాల కోసం చూశాను. అక్కడి దుకాణంలోని ప్రతి ఒక్కరితో అద్భుతమైన సమయాన్ని గడిపాను. దాంతో విమాన ప్రయాణం నుంచి కలిగిన అలసటను మరిచిపోయాను. నేను అక్కడి వెళ్ళే ముందు, కొంతమంది చిన్నారులు నాతో ఫొటో కోసం అడిగారు. తెల్లటి దుస్తులు ధరించిన చిన్నారులు, నేను వస్తున్నానని తెలిసి ఆమె తల్లి చాలా ఉత్సాహంగా ఉంది. నాలాగే అందంగా కనిపించేలా చిన్నారులను ముస్తాబు చేసింది. ఆమె ఏం ధరించినా అందంగా కనిపించింది. మరియు నాతో ఫొటో దిగిన చిన్నారులు అంతే ఉత్సాహంగా ఉన్నారు. 

నా సూట్‌కేస్‌లో జీబ్రా-ప్యాటర్న్ డ్రెస్ ఉంది. మిస్ వరల్డ్ ఈవెంట్ తర్వాత వచ్చి ఆమెతో మ్యాచ్ అయ్యేలా ఆ డ్రెస్‌లో మళ్ళీ వస్తానని చెప్పాను. వాళ్ళ అమ్మ నాతో ఫోటో దిగే అవకాశం రాలేదు. మళ్లీ వచ్చినప్పుడు ఫొటో దిగుతానని చెప్పాను. వాళ్ల షాపు వెనుక ఉన్న వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించారు. వాళ్ళ అమ్మ వంట చేస్తోంది. ఆ గుమగుమలు నేను గమనించాను. మళ్లీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి తిరిగొచ్చేశా. దురదృష్టవశాత్తూ, ఈ ముగ్గురు అందమైన అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు 17 మంది మే 18న జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయారు.

నాకు మాటలు రావడం లేదు..

వారి గురించే నా ఆలోచనలు. ఆ బాధను వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. నాతో ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు. నేను విజేతగా నిలవాలని ప్రార్థించిన చిన్నారులు, ఆ కుటుంబం నేడు ప్రాణాలతో లేదు. ఆ అగ్నిప్రమాదం ఘటనతో నా హృదయం ముక్కలైంది. నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకేనేందుకు వారు ప్రాణాలతో లేరు. మీరు నా మనసులో ఎప్పటికీ ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. అవకాశం ఉంటే వచ్చే జన్మలో మళ్ళీ కలుద్దాం’ అని మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన థాయ్‌లాండ్ భామ

దాదాపు నెల రోజులపాటు జరిగిన మిస్‌ వరల్డ్ 2025 పోటీల్లో ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ విజేతగా నిలిచారు. మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన వరల్డ్‌ పోటీల్లో ఓపల్ సుచాత విజేతగా నిలిచి భారత కరెన్సీలో రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ పొందారు. ఆమెకు ఏడాదిపాటు అనేక సదుపాయాలు కల్పిస్తారు.