Minister KTR Latest News: హైదరాబాద్ లో త్వరలో వార్డుల ప్రాతిపదికన పాలన పద్ధతి తీసుకురావాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ప్రతి పౌరుడికి వివిధ రకాల సేవలు వీలైనంత త్వరగా అందించాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు. అతి త్వరలోనే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వార్డుల పాల‌న పద్ధతి రానుందని, అందుకు చర్యలు కూడా చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం స‌చివాల‌యంలో మంత్రి కేటీఆర్ పుర‌పాల‌క శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అతి త్వర‌లోనే హైద‌రాబాద్‌లో వార్డు పాల‌న ప‌ద్ధతికి శ్రీకారం చుడతామ‌ని చెప్పారు. జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. మే నెల‌ఖారు లోపు ఈ వార్డు కార్యాల‌యాలు ప్రారంభిస్తామ‌ని మంత్రి ప్రకటించారు. పాల‌న వికేంద్రీక‌ర‌ణ‌ వల్ల  ప్రజలకు వేగంగా ప‌రిపాల‌న ఫలితాలు అందుతాయని అన్నారు. 

వార్డు కార్యాల‌యంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. అసిస్టెంట్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారని అన్నారు. స‌ర్కిల్, జోన‌ల్ ఆఫీసుల‌కు వెళ్లకుండా వార్డు కార్యాల‌యంలోనే సేవ‌లు అందేలా చ‌ర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌరులకు అత్యంత సౌకర్యంగా ఉండేలా సిటిజ‌న్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాల‌యాలు ఉంటాయని చెప్పారు. ప్రతి వార్డు ఇంకో వార్డు కార్యాల‌యంతో అనుసంధానం అవ్వాలని కేటీఆర్ సూచించారు.

నిన్న రాజన్న సిరిసిల్లలో పర్యటన

నిన్న మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకొని వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హెక్టారుకు 25 వేల రూపాయల పరిహారం ఇస్తున్నామని అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ముస్తాబాద్ మండలం గోపాల రావుపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా, వీర్నపల్లి మండలంలో క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు.

ఉచిత పథకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో పాలు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మూడు సిలిండర్లు ఎందుకు ఫ్రీగా ఇవ్వరని మంత్రి అడిగారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో మూడు సిలిండర్లు ఫ్రీ అని ప్రధాని చెప్పారని ఆయన కర్ణాటక రాష్ట్రానికి ప్రధానా, లేక దేశానికి ప్రధానా చెప్పాలని మంత్రి నిలదీశారు. ఇప్పటివరకు ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదని పదే పదే చెప్పి ఇప్పుడు కర్ణాటకలో మూడు సిలిండర్లు ఉచితమని చెప్పడం ఎంతవరకు కరెక్టో చెప్పాలని ప్రశ్నించారు. ఆదానీ కొన్న ఎయిర్ పోర్టుకు జీఎస్టి వేయరని, పాలు, పెరుగులపై మాత్రం జీఎస్టీ వేసి బాదుతారని కేటీఆర్ అన్నారు.