Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాల నుంచి ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో సౌకర్యాలను మెరుగు పరిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 25 రకాలు మార్పులు చేపట్టినట్లు స్పష్టం చేసింది. సీట్లలో ఎనిమిదిన్నర గంటల పాటు కూర్చోవాల్సి వస్తుండటంతో అనేక మంది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా సీట్లు బాగా లేవని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు. ఈక్మరంలోనే రైల్వేశాఖ అప్రమత్తం అయి.. మార్పులు, చేర్పులు చేస్తోంది. గంటలపాటు ప్రయాణం చేసే ప్రాయాణికులు హాయిగా పడుకునేలా పుష్ బ్యాక్‌ను, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ను, ఫుట్ రెస్ట్‌ను మెరుగుపరిచారు. అలాగే మరుగు దొడ్లలో వెలుతూరు, వాష్ బేసిన్ల లోతును కూడా పెంచారు. ఇవే కాకుండాఏసీ అధికంగా రావడానికి ప్యానెళ్లలో రైల్వేశాఖ మార్పులు చేసింది.
అంతేకాకుండా దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు. కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు. ఎయిర్ టైట్ ప్యాన్సల్స్ లో మార్పులు చేయనున్నారు. ఎమర్జెన్సీ పుష్ బటన్ ను మరింత సులువు చేయనున్నారు. కోచ్ కు కోచ్ కు మధ్య అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ ను మరింత పారదర్శకంగా రూపొందిస్తారు. టాయిలెట్లలో లైటింగ్ మెరుగుపరుస్తారు. 1.5 వాట్ల నుంచి 2.5 వాట్ లకు పెంచుతారు. నీటి ప్రవాహం మరింత మెరుగుపడేలా వాటర్ ట్యాప్ ఏరేటర్లు ఏర్పాటు చేస్తారు.
కాచిగూడ - యశ్వంత్ పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం ట్రయల్‌రన్ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఈ రైలు రాత్రి తిరిగి వచ్చింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళ్తాయి. విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు మాత్రం గూడూరు నుంచి శ్రీకాశహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళ్తుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వెల్లడించారు.
ఈనెల 24వ తేదీ నుంచి కాచిగూడ - యశ్వంత్ పూర్ రైలు ప్రారంభం
భాగ్యనగరం నుంచి బెంగళూరు మధ్య ఈనెల 24 తేదీ ఆదివారం నుంచి వందేభారత్ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభించనున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వేశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం రైలులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్ రైలు మాత్రం కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోనుంది.