Telangana Politics : హైదరాబాద్: తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ఆదివారం చిట్ చాట్ లో కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే టాలీవుడ్ నటుడు చిరంజీవి కచ్చితంగా బిజెపిలో చేరతారని తన మనసులో మాట బయటపెట్టారు. సినీ ఇండస్ట్రీలో పలువురితో బిజెపికి సత్సంబంధాలు ఉన్నా యని.. కొందరు తమ పార్టీలో చేరి కేంద్ర మంత్రులు సైతం అయ్యారని గుర్తు చేశారు. మరికొందరు పార్టీలో చేరి విమర్శలు చేసి వెళ్లిపోయారని చెప్పారు.

ఒంటరిగానే బరిలోకి బీజేపీబిజెపి, కాంగ్రెస్ ఒకటేనని ఎవడో పనికిమాలిన వాడు చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెప్పాలా అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు బిజెపి ఎప్పుడు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. 

ఈటలకు ఆ నిబంధన వర్తించదు..టిఆర్ఎస్ లో తర్వాత అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసు. ఆ పార్టీలో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయి. బిజెపిలో అలాంటి పరిస్థితి ఎన్నటికీ ఉండదు. బిజెపిలో బీసీలకు ప్రాధాన్యం కల్పించాము. 50 శాతం బిజెపి మండల అధ్యక్షులుగా బీసీలు ఉన్నారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక మరోసారి ప్రజల్లోకి వెళతాం. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలంటే రెండుసార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. కానీ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు ఆ నిబంధన వర్తించదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణకు బీజేపీ ఏం చేసిందంటే..రాష్ట్ర ఆదాయం దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేయాలని, ఉచితలకు బిజెపి ఎప్పుడు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్, వరంగల్ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చింది తామే అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి సైతం విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం నిధులు అందించి సహకరిస్తుందన్నారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ నేతగా ఎదగాలని చూస్తున్నారు. కానీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో కలిసి పనిచేసే పార్టీ ఎంఐఎం అని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. అసదుద్దీన్ తీరు నచ్చక ముస్లిం నేతలు ఆయనను పిట్టలదొర అని అంటారని తెలిపారు. తమ వల్లే రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ చెబితే ఈడ్చి తన్నాలి. తెలంగాణ కోసం ఎంతో చేసిన పార్టీ తమదేనని, కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తుందని తెలిపారు.

చిరంజీవి సోదరుడు, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్నారు. జనసేన అధినేత ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. దక్షిణాది బీజేపీ రాజకీయాలకు వీలుచిక్కినప్పుడల్లా తన వంతు సహకారం అందిస్తున్నారు. కిషన్ రెడ్డి అన్నట్లుగా నిజంగానే చిరంజీవి బీజేపీలో చేరతారా అనే చర్చ మొదలైంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి లక్ పరీక్షించుకున్నారు. అది బెడిసి కొట్టడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభకు పంపించడంతో పాటు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయాల నుంచి వైదొలిగిన చిరంజీవి మళ్లీ అటువైపు రానని గతంలోనే స్పష్టం చేశారు. సినిమాలే తనకు జీవితమన్నారు.