తెలంగాణలో 6 కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని ఆర్‌జీఐఏ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి కోసం కూడా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల సంఖ్య పెంపునకు పని చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం వీరు వివిధ అంశాలపై కలిసి మాట్లాడుకున్నారు.
ఆర్థికంగా తెలంగాణ అభివృద్ధి చెందడంతోపాటు, హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్నందున, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రిని కోరారు. హెల్త్ హబ్‌గా, ఐటీ హబ్‌గా, టూరిజం హబ్‌గా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం రాన్రానూ విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణికులు వస్తున్నారని గుర్తు చేశారు.
6 ఎయిర్ పోర్టులపై చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు జిల్లాల్లో 6 ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తగిన సహకారం అందించాలని కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ చెప్పిన అంశాలపై స్పందించిన కేంద్రమంత్రి అన్నింటికీ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతిపాదనలో ఉన్న 6 ఎయిర్ పోర్టుల్లో ఒకటైన వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు అథారిటీ లాండ్ (ఏఐ) ఏటీఆర్ ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా (జక్రాన్ పల్లి)లో ఎయిర్ పోర్టుకు సంబంధించిన టెక్నికల్ క్లియరెన్స్ ఇస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టును ఎయిర్ ఫోర్స్ ద్వారా ఏర్పాటు చేసే విషయాన్ని తమ మంత్రిత్వశాఖ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పెద్దపల్లి (బసంత్ నగర్), కొత్తగూడెం, మహబూబ్ నగర్ (దేవరకద్ర) ఎయిర్ పోర్టుల్లో చిన్న విమానాలు వచ్చిపోయేలా చేయడానికి పున: పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి సింధియా హామీ ఇచ్చారు.