TSRTC Special Buses For Sankranthi: సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ట్వీట్ చేసింది. 


మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి శుక్రవారం (డిసెంబర్ 9) ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని అన్నారు. ఈసారి వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని చెప్పారు. 






రెండు నెలల ముందే బుక్ చేసుకొనే సౌకర్యం


‘‘జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రికి 40 చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతాం. వీటితోపాటు తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నాం. గతంలో 30 రోజుల ముందు వరకూ మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఈ రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని వీసీ సజ్జనార్‌ చెప్పారు.


ఆ బస్సులు క్రమంగా స్క్రాప్‌ కు..


తెలంగాణ ఆర్టీసీలో (Telangana RTC) 15 ఏళ్ల నుంచి నడుస్తున్న దాదాపు 700కు పైగా బస్సులను రోడ్లపై నుంచి తొలగించనున్నారు. 15 ఏళ్ల నాటి వాహనాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana RTC) నిర్ణయించింది. 2023 మొదటి త్రైమాసికంలో బస్సులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15 ఏళ్ల నాటి వాహనాలను రోడ్లపై నుంచి తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీనిని అమలు చేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.


వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని తెలిపారు. బస్సుల ఉపసంహరణ నిర్ణయం వల్ల కొంత సమయం వరకు ప్రయాణికులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, అయితే దశలవారీగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్‌ఆర్‌టీసీ చర్యలు తీసుకుంటోందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోగా కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.