TSRTC Bus Tracking: మీరు మీ జీవితంలో ఎన్నో సార్లు బస్సుల కోసం వేచి చూశారా? అసలు బస్సు వస్తుందో, రావట్లేదో లేదా వచ్చి వెళ్లి పోయిందో తెలియక అలాగే పడిగాపులు కాయడం మనందరికీ అనుభవమే. తరచూ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో, ఇంకా ఎంత సేపటికి వస్తుందో తెలిస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది. పడిగాపులు కాసే పరిస్థితి తప్పుతుంది. ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ ఆ దిశగా కసరత్తు చేసింది.
ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌లలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఏ బస్సు ఎక్కడుందోతెలియజేసే ట్రాకింగ్ సేవలను మంగళవారం (జూలై 26) ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే రైళ్లలో ఈ సదుపాయం ఉంది. రైల్ యాత్రి అనే యాప్ ద్వారా రైలు లైవ్ స్టేషన్ ను తెలుసుకోవచ్చు.
ప్రయాణికులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి TSRTC Bus Tracking యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో 96 డిపోల్లో ఎంపిక చేసిన 4,170 బస్సుల్లో ఈ ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలానా బస్టాప్‌కు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే అంచనా సమయం కూడా తెలవనుంది. రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు తెలంగాణ బస్సులు వెళ్లిన సందర్భంలోనూ ట్రాకింగ్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 140 బస్సులను ఎంపిక చేయగా, కంటోన్మెంట్, మియాపూర్ - 2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయం ఉంది. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాకింగ్ సిస్టమ్ ను అమర్చారు. త్వరలో హైదరాబాద్ లోని అన్ని రిజర్వేషన్ సర్వీసులను కూడా ట్రాకింగ్ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపై కూడా ప్రయాణికులు తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు.