TSPSC Paper Leak Case: 
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 99 కి చేరింది. ఈ ముగ్గురు కూడా ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ కు సహకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌ కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ సంవత్సరం మార్చి నెలలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం వెలుగులోకి వచ్చింది. మొదట టీఎస్సీపీఎస్సీ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు హ్యాక్‌ అయినట్లు అధికారులకు సమాచారం అందింది.


విచారణ చేపట్టిన అధికారులు టీఎస్సీపీఎస్సీ కార్యాలయంలో దర్యాప్తు చేపట్టగా.. కంప్యూటర్లు హ్యాక్ కాలేదని పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ  నిర్వహించే పరీక్ష పేపర్ లీకైనట్లుగా గుర్తించారు. దీంతో ఈ  విషయమై సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రధాన నిందితుడు ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా..కొన్ని ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్‌ కుమార్ టీఎస్పీఎస్పీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కొంత కాలం నుంచి టీచర్‌ గా పని చేస్తున్న రేణుక అనే ఆమెతో పరిచయం ఉంది.  ఈ క్రమంలోనే రేణుక వారి స్నేహన్ని అడ్డుపెట్టుకుని అసిస్టెంట్ ఇంజినీర్ కి సంబంధించిన ప్రశ్నాపత్రం కావాలని అడిగింది. రేణుక భర్త డాక్యా నాయక్‌ తో కలిసి 10 లక్షలకు డీల్‌ కుదుర్చుకుంది. 


దీంతో అతడు నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రాజ్ శేఖర్‌ రెడ్డి సాయం కోరాడు. ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్ వర్డ్ ని కొట్టేశారు. అయితే టీఎస్పీఎస్సీ లో అన్ని కంప్యూటర్లు ఒకే ల్యాన్‌ కింద కనెక్ట్ అయి ఉండటంతో.. సర్వర్‌ లో పాస్ వర్డ్ టైప్ చేసి ప్రశ్న పత్రాలు తీసుకున్నారు. తరువాత వాటిని ఓ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్న ప్రవీణ్.... రేణుకకి ఇచ్చాడు. ఆమె నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నాడు. ఆమె తన సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌..అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులతో డీల్‌ సెట్‌ చేసేందుకు సహకరించాడు. ఆ తరువాత వారు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ ను సంప్రదించగా.. అతను డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ తనకు తెలిసిన వారందరికీ ఈ విషయం తెలియజేసి డబ్బులు చెల్లించి పేపర్ తీసుకునేటట్లుగా డీల్ సెట్‌ చేసుకున్నారు.


ఇలా మొత్తం రూ. 13.5 లక్షలు సేకరించారు. ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా పూర్తవడంతో.. ఇదే పంథాలో టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా ఇంటి దొంగలు లీక్ చేసినట్లు సమాచారం. మార్చి 11 టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈ విషయాలన్ని గుర్తించామని పోలీసులు వెల్లడించారు. టౌన్‌ ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్‌ అయ్యాయన్న అనుమానంతో టీఎస్పీఎస్సీ ఫిర్యాదు చేయగా..తాము దర్యాప్తు చేశామని, ఈ క్రమంలో మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్ పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని గుర్తించామని చెప్పారు. 


ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నామని... గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులు కొందరు విదేశాల్లో కూడా ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.