Hyderabad Rains: సరిగ్గా మూడు రోజుల కిందట తరహాలో హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు భానుడి భగభగలతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండగా, మరికొన్ని ఏరియాలలో మోస్తరు వర్షం కురుస్తోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలు సహా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. జీడిమెట్ల, గాజులరామారం, దూలపల్లి ఏరియాలతో పాటు అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, మణికొండలో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ఎండల నుంచి భాగ్యనగర వాసులకు ఉపశమనం కలిగింది. వర్షపు నీరు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
మియాపూర్, జేఎన్టీయూ, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, నిజాంపేట ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దక్షిణ ఛత్తీస్ గఢ్ & పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం, దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మరొక ఆవర్తనం ఈరోజు బలహీన పడ్డాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుండి మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద కొనసాగుతోంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచనను అధికారులు అంచనా వేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఏపీలోనూ వర్షాలు..
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోనూ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో మొదలైన వర్షాలు నేరుగా శ్రీకాకుళం జిల్లాను తాకాయి. జిల్లాలోని శ్రీకాకుళం నగరం - రణస్థలం పరిధిలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొండ ప్రాంతాలు ముఖ్యంగా అరకు వ్యాలీ - పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు భాగాల్లో మోస్తరు వర్షం కురవనుంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు చెబుతున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాల్లో, సత్యసాయి జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది.