తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12న వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు, అలాగే తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే (ఇంప్రూవ్‌మెంట్) వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఖరారు చేసింది. 

Continues below advertisement

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలు మే 13, 2026 నుండి రెండు సెషన్లలో ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22, 2026 నుండి నిర్వహించనున్నారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు తమ జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ 13, 2026 నుండి ఏప్రిల్ 20, 2026 వరకు ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చు.

Continues below advertisement

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం 66.20 శాతం విద్యార్థులు పాస్ కాగా, ఇంటర్‌ రెండో సంవత్సరంలో 70.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

రీకౌంటింగ్,  రీవెరిఫికేషన్ ప్రక్రియ  ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తమ జవాబు పత్రాలను రీకౌంటింగ్ (Recounting) చేయించుకునేందుకు లేదా జవాబు పత్రం యొక్క స్కాన్డ్ కాపీతో కూడిన రీవెరిఫికేషన్ (Re-verification)కు బోర్డు అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్‌కు ప్రతి పేపర్‌కు రూ. 100/, స్కాన్డ్ కాపీతో కూడిన రీవెరిఫికేషన్ కోసం ప్రతి పేపర్‌కు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.in లోని 'స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్' ద్వారా ఏప్రిల్ 13, 2026 నుండి ఏప్రిల్ 20, 2026 వరకు ఈ ఫీజును చెల్లించవచ్చు.

ముఖ్య గమనికలు: గడువు ముగిసిన తర్వాత ఆన్‌లైన్ సేవలు నిలిపివేయబడతాయి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదు. అలాగే మాన్యువల్ దరఖాస్తులను బోర్డు స్వీకరించదు. ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి రీఫండ్ చేయబడదు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తాము ఏ సబ్జెక్టులకు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోరుకుంటున్నారో వాటిని ఎంచుకుని, తమ పూర్తి చిరునామా, ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. విద్యార్థులు కేవలం తమ స్వంత జవాబు పత్రాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి; ఇతరుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను పొందేందుకు ప్రయత్నించడం నేరంగా పరిగణించబడుతుంది.