దళిత దండోరా సభలో రేవంత్ రెడ్డి, తెలంగాణ విమోచన సభలో బీజేపీ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు దీటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి పేరుకే పీసీసీ అధ్యక్షుడు అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చంద్రబాబు చెప్పిన‌ట్లు న‌డుచుకుంటున్నార‌ని చెప్పారు. రేవంత్ నైజం ఏంటో శ‌శిథ‌రూర్‌పై ఆయ‌న మాట్లాడిన మాట‌లు చూస్తుంటే అర్థమ‌వుతుంద‌ని విమర్శించారు. తెలంగాణ కంటే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకం ఎక్కువ‌గా ఉంద‌ని వివరించారు. పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ భవన్‌లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాగానే వస్తున్న ఊహాగానాలపై టీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. మరోవైపు, తెలంగాణ విమోచనదినం ఒక విషాద ఘటన అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు జూన్ 2వ తేదీ ఉంది కదా అని అన్నారు. 


ఆ ఆక్రోశంతోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
గ‌జ్వేల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ స‌భ‌కు వ‌చ్చిన ప్రతి ఒక్క వ్యక్తి రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారని మెద‌క్ ఎంపీ కొత్త ప్రభాక‌ర్ రెడ్డి అన్నారు. అబ‌ద్దాలు మాట్లాడి ప్రజ‌ల‌ను మోసం చేసేలా కాంగ్రెస్ నేత‌ల మాట‌లు ఉన్నాయ‌ని విమర్శించారు. గ‌జ్వేల్‌కు రైలు వ‌చ్చిందంటే అది కేసీఆర్ వ‌ల్లే అని వివరించారు. అధికారం కోల్పోయి 10 ఏళ్లు కావడంతో ఆ ఆక్రోశంతోనే కాంగ్రెస్ నేత‌లు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వివరించారు. ప‌ల్లెను వ‌దిలిన ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాల‌న‌లో మ‌ళ్లీ ప‌ల్లెకు చేరారని ఎంపీ ప్రభాక‌ర్ రెడ్డి చెప్పారు.


రాజకీయాల నుంచి తప్పుకుంటా
ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రేవంత్ రెడ్డి సభకు వచ్చిన వారిలో 8 ఎకరాల్లో 2 లక్షల మంది ఎలా పడతారు? 2 లక్షల మంది వచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటా! 2 లక్షల మంది రానట్లు అయితే పీసీసీకి రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మిస్తున్నారు. రేవంత్ రెడ్డితో నేను 8 ఏళ్ళు పనిచేశాను. ఆయన ఒక డ్రామా కంపెనీ. జై కొట్టే వాళ్ళు విజిల్ వేసే వాళ్ళు ఆయన మనుషులే ఉంటారని ఎద్దేవా చేశారు. రేవంత్‌కి దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి. పథకాలపై విమర్శలు చేసే ప్రతి కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలు తీసుకోవద్దు.’’ అని అన్నారు.


కరీంనగర్‌లో మాట్లాడిన మంత్రి గంగుల
హుజూరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి జరగలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక స్థానిక సంస్థలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా ప్రభుత్వ నిధులను అందిస్తున్నారని తెలిపారు. ఏడేళ్లుగా మంత్రిగా ఉన్న ఈటల హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయలేదని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా పట్టణాభివృద్ధి కోసం రూ.56 కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తుచేశారు. హుజూరాబాద్‌ను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌, కరీంనగర్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని గంగుల అన్నారు.