Trains Cancellation: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఏ రహదారిపై చూసినా నీళ్లు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు అన్నీ నిండుకుండల్లా మారి పొంగిపొర్లుతున్నాయి. అయితే భారీ వర్షాలు కురుస్తున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్విట్టర్ వేధికగా ఏయే రైళ్లను రద్దు చేస్తుందో వివరించింది. ముఖ్యంగా హసన్ పర్తి - కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్ పై భారీగా వర్షపు నీరు నిలవడంతో మూడు రైళ్లును పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్ - తిరుపతి (17262), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. 






తెలంగాణలో భారీ వర్షాలతో సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా వరదలతో ఇళ్లలోకి బాగా వరద నీరు చేరుతూ ఉంది. భారీ వర్షాలకు కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌ కూడా చిక్కుకుపోయింది. పలు రైళ్ల రాకపోకలకు జంక్షన్‌ అయిన ఈ స్టేషన్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది.


రైల్వే ట్రాక్స్ పైకి మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హసన్‌పర్తి - ఖాజీపేట రైలు మార్గంలో మూడు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకో తొమ్మిది రైళ్లను దారి మళ్లించారు.