Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవి శంషాబాద్ లో ఉందని తెలిసిందే. అయితే ఈ అడవిలో వుడ్ బై స్టోన్ క్రాఫ్ట్, ఆదిత్య మెహతా ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్రయల్ ఫెస్ట్ ను నిర్వహించింది. ఈ క్రమంలోనే 5కే, 10కే, 15కే పరుగు, సైకిల్ రైడ్ ను దివ్యాంగుల కోసం నిర్వహించింది. ఈ ఫెస్ట్ కు దాదాపు వెయ్యి మందికి పైగా దివ్యాంగులు హాజరయ్యారు. అలాగే పరిశ్రమలు, ఐటీ విభాగాల సెక్రటరీ జయేష్ రంజన్, డిజైనర్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ శిల్పా రెడ్డి, నటి రెజీనా కసాండ్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ ఫారెస్ట్‌లో పరిగెత్తడం,  సైకిల్ తొక్కడం కూడా ఇదే మొదటి సారి కావడం విశేషం.


ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు..


శంషాబాద్ లో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం  ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిగా గుర్తించారు. అయితే ఈ ట్రయల్ ఫెస్ట్ సూర్యోదయానికి అనుగుణంగా రూపొందించారు. ఇక్కడ పాల్గొనేవారు అడవిని చూడటమే కాకుండా, స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోవచ్చు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఎందుకంటే అతిథులు పెయింట్‌ బాల్, ఆర్చరీ, టార్గెట్ షూటింగ్ వంటి ఆటల్లో నినగ్నమయ్యారు. అనేక ఫుడ్ స్టాల్స్‌లో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలు కూడా అందుబాటులో ఉంచారు. భారత దేశంలోని అగ్రశ్రేణి మహిళా డీజేలలో ఒకరైన డీజే పరోమా, బెస్ట్ కీప్ట్ సీక్రెట్ వంటి లైవ్ బ్యాండ్‌ల ప్రదర్శనలతో ఈ కార్యక్రమం ముగిసింది.


ఈ ట్రయల్ రన్ ప్రతీ ఒక్కరికీ మంచి అనుభవాన్ని ఇచ్చింది..


 ఈ కార్యక్రమం గురించి స్టోన్‌క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ... “మేము నిర్మించిన ఈ అడవిని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి. పరుగు ప్రతి ఒక్కరికి మంచి అనుభవాన్ని అందించింది. మన చుట్టూ ఉన్న పచ్చదనం చూసి మన చాలా స్ఫూర్తిని పొందవచ్చు. ట్రయల్ రన్ ను జాగ్రత్తగా నిర్వహించాం. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఏర్పాటు చేశాం." అని చెప్పారు. అలాగే ప్రకృతి ప్రేమికులు అందరూ ఒక్క సారి అయినా హైదరాబాద్ లోని ఈ అతిపెద్ద మియావాకీ అడవిని చూడాలని కోరారు. 


ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని తిరిగి పొందేందుకే..


రెండు సంవత్సరాల పాటు చాలా కష్టపడి మొత్తం 18 ఎకరాలలో ఈ మియావాకీ అడవిని నిర్మించారు. తారు/కాంక్రీట్ రోడ్లపై పరుగెత్తడం కంటే మట్టి/భూమిపై పరుగెత్తడం మంచిదని ఈ ట్రయల్ రన్ ద్వారా నిర్వహించారు. అయితే ప్రస్తుత కాలంలో అందరూ బిజీబిజీ పరుగుల మధ్య జీవితాలను గడుపుతున్నారని.. అందుకే భూమి, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కోల్పోతున్నారని వుడ్స్ వ్యవస్థాపకులు తెలిపారు. అయితే ప్రకృతితో తిరిగి ఆ అనుబంధాన్ని పొందేలా చేసేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు.