హైదరాబాద్‌లో నేడు ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నేడు తెలంగాణ హైకోర్టుకు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరుగుతుంది. సీజేతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా.. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వివి విగ్రహం జంక్షన్ వరకు ఉన్న మార్గంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్లుగా చెప్పారు.
అంతేకాక, సాయంత్రం 5.30 గంటలకు హైటెక్ సిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నూతనంగా ఏర్పాటైన టీ హబ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ వేడుకకు ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులు, సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులు సహా పలువురు హాజరు కానున్నారు. దీంతో ప్రగతి భవన్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో సాయంత్రం వేళ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
రాజ్ భవన్ వద్ద ఇలా..
పరిస్థితులను బట్టి, రాజీవ్ గాంధీ విగ్రహం, వివి విగ్రహం జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లి్స్తామని, లేదా నిలిపివేస్తామని పోలీసులు వెల్లడించారు. పంజాగుట్ట – రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ మార్గంలో ఈ సమయంలో రెండు వైపులా ట్రాఫిక్ కోసం ఆపేస్తామని చెప్పారు.
రాజ్ భవన్ వద్ద వాహనాల పార్కింగ్ కోసం.. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుండి గేట్ No-III: జడ్జిలు, MP, MLA, MLC వాహనాలు, దిల్ ఖుషా గెస్ట్ హౌస్‌లో మీడియా వాహనాలు, MMTS రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఇతర వీఐపీ, ప్రభుత్వ ప్రముఖుల వాహనాలు, మెట్రో రెసిడెన్సీ NASR స్కూల్: సింగిల్-లైన్ పార్కింగ్, లేక్ వ్యూ VV విగ్రహం జంక్షన్ లో సింగిల్ లైన్ పార్కింగ్ ఏర్పాట్లను చేసినట్లుగా ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఈ సమయాల్లో రాజ్ భవన్ రోడ్ లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం మేలని సూచించారు.
సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు తర్వాత ఐదో చీఫ్ జస్టిగ్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అవుతారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఆయన హాజరవుతారని స్పష్టత ఏమీ లేదు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వస్తారని సమాచారం. గవర్నర్ తమిళిసై - సీఎం కేసీఆర్ మధ్య కొద్ది కాలంగా వైరం ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ వైఖరితో ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. సీఎం వ్యవహారం పట్ల గవర్నర్ కూడా అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా రాజ్ భవన్‌కు దూరంగా ఉన్నారు. ఆయన చివరిసారిగా గత ఏడాది అక్టోబరు 11న రాజ్ భవన్‌కు వెళ్లారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతున్నట్లుగా తెలుస్తోంది.