హైదరాబాద్: దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా శంషాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచు కారణంగా శుక్రవారం (జనవరి 2) ఉదయం నుంచే రహదారిపై దృశ్యమానత (Visibility) భారీగా తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొనడంతో ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తమ వాహనాలను రహదారి పక్కనే నిలిపివేశారు. దీని ప్రభావంతో శంషాబాద్ సమీపంలోని జాతీయ రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
పొగమంచు ప్రభావం కేవలం జాతీయ రహదారిపైనే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పైన కూడా తీవ్రంగా కనిపిస్తోంది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, వాహనాలను సురక్షితంగా పంపించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఫాగ్ లైట్లను ఉపయోగిస్తూ ఉదయం వేళ తక్కువ వేగంతో ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.