Shamirpet Elevated Corridor: గుడ్‌న్యూస్.. త్వరలోనే ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్లు.. !
పారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు 18 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి త్వరలో టెండర్లు పిలవనుంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA).

Flyover from Paradise to Shamirpet: హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ఎట్టకేలకు టెండర్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరులో టెండర్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అక్టోబర్ 29న ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు HMDA (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) సిద్ధమైనట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ అవుటర్ రింగ్ రోడ్ (ORR) వరకు నిర్మించనున్న ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి అత్యంత కీలకమైన రక్షణ శాఖ భూముులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగింత అంశం త్వరలోనే కొలిక్కి రానుంది.
అనంతరం శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్యారడైజ్ నుంచి రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుల్లో ఒకటైన డైయిరీ ఫాం కారిడార్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే పారడైజ్ నుంచి శామీర్‌పేట్ కారిడార్ పనులు ప్రారంభించనుంది. ఈ రెండు కారిడార్ ప్రాజెక్టులు పూర్తయి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ వైపు ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మేడ్చల్, నిర్మల్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వైపు రాకపోకల్లో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ట్రాఫిక్ తగ్గడంతో పాటు జర్నీ టైం సైతం కలిసిరానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ రాష్ట్ర రహదారి 1 నుంచి వెళ్తుండగా, ప్యారడైజ్ నుంచి డైరీ ఫాం కారిడార్ నేషనల్ హైవే 44 మీదుగా వెళ్తుంది.
శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ సమగ్ర స్వరూపం..
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ ఇంటర్‌ఛేంజ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. మొత్తం దూరం: 18.10 కిలోమీటర్లు కాగా, అందుకు 197 ఎకరాల భూమి అవసరం పడుతుంది. అందులో రక్షణ శాఖకు చెందిన భూములు 113.48 ఎకరాలు ఉన్నాయి. అందువల్ల ఈ రెండో కారిడార్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. భూ పరిహారంతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,619 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రక్షణ శాఖ భూములకు సంబంధించి అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉంది. అనంతరం కారిడార్ నిర్మాణ పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది.






















