తెలుగు అకాడమీలో మరో కుంభకోణానికి ప్రణాళికలు వేసినట్లుగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. దీని విలువ దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే అకాడమీకి చెందిన రూ.63.47 కోట్ల నిధులను కేటుగాళ్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. అకాడమీ ఇచ్చిన కవరింగ్‌ లెటర్లు మార్చి ఈ ముఠా కథ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీ అధికారులు కూడా తమకు చేరిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సంబంధించిన నకిలీ బాండ్లను గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. 


ఈ కుంభకోణం సూత్రధారుల్లో ఒకడైన రాజ్‌ కుమార్‌ అకాడమీకి– బ్యాంకులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేవాడని తెలిపారు. అకాడమీ నిధులను కొల్లగొట్టడానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ మస్తాన్‌ వలీ, సోమశేఖర్, శ్రీనివాస్‌లతో కలిసి ప్రణాలిక రచించినట్లుగా పోలీసులు తెలిపారు.


Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..


బెడిసి కొట్టిన ప్లాన్
గత ఏడాది డిసెంబర్‌ నుంచి గత నెల వరకు సంతోష్‌నగర్, కార్వాన్‌ల్లోని యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా, చందానగర్‌ కెనరా శాఖల్లో ఉన్న రూ.63.47 కోట్లను ఈ ముఠా నొక్కేసింది. ఈ క్రమంలోనే చందానగర్‌లోని అదే బ్రాంచ్‌లో ఉన్న మరో రూ.20 కోట్ల ఎఫ్‌డీ సొమ్మునూ తమ ఖాతాల్లోకి మళ్లించడానికిగాను నకిలీ పత్రాలను రూపొందించింది. మరోవైపు తెలంగాణ - ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి సంబంధించి గత నెల 14న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం పంపకం చేయాలని స్పష్టం చేసింది. 


ఈ మేరకు వాటి లెక్కలు చూడాలని అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డి ఆదేశాలిచ్చారు. దీంతో అకాడమీ అధికారులు ఈ నెల 18న బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు అకాడమీ అధికారులు లేఖలు రాయడంతోపాటు బాండ్లు అందించడంతో ఆ రూ.20 కోట్లు తెలుగు అకాడమీ ఖాతాలోకి వచ్చాయి. దీంతో ఈ ముఠా ప్లాన్‌ బెడిసికొట్టింది.


Also Read: పిల్లలూ దసరా సెలవులు వచ్చేశాయి.. మళ్లీ స్కూల్ కి ఎప్పుడంటే


ఇవాళ మరికొందరు అరెస్టయ్యే ఛాన్స్
సీసీఎస్‌ పోలీసులు సోమవారం సైతం అకాడమీ, బ్యాంకు అధికారులను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఓ కీలక నిందితుడు చిక్కితే ఈ స్కామ్‌లో అకాడమీ అధికారుల పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం దళారుల సహకారం ఎందుకనే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. మంగళవారం మరికొందరు నిందితులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. రూ.6 కోట్లు ది ఏపీ మర్కంటైల్‌ కో– ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సత్య నారాయణరావుకు చేరినట్లు తేలగా, మిగిలిన మొత్తం ఏమైందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Also Read: పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి గరం గరం.. ఇమ్రాన్ తీరు ప్రస్తావించి గట్టి షాక్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి